పుట:Dvipada-basavapuraanamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii

జెప్పఁబడుట జైనపురాణవస్తులక్షణములలో ప్రధాన మైన దని విమర్శకులు పేర్కొని యున్నారు. [1] ఇట్టి జైనపురాణ సంప్రదాయమును గమనించిన సంస్కారముతో, నఱువత్తుమూవురిలో నందఱు వీరశైవులు కాక పోయినను, పురాణ ప్రాశస్త్య సంపాదనార్ధము వారి కథలను గైకొని దేశీయ మైన సంప్రదాయముతోపాటు శివభక్తాభీష్టమును సోమనాథుఁడు పాటించె నని తలంప వీలగు చున్నది.

సమకాలీన భక్తుల చరిత్రములు బసవనితో ముడివడియున్నట్లును, పురాతన భక్తచరిత్రములు తత్కథాసందర్భములందు దృష్టాంతరూపములుగాఁ జెప్పఁబడినట్లును కూర్చుట సోమనాథుని కథాసంవిధాన నైపుణ్యము. పురాతన భక్తులలో ముగ్ధభక్తులు కొందరు కలరు. “నిక్కమీశ్వరుఁగాని నిజమెఱుంగమిని, ముక్కంటి భక్తులు ముగ్ధలుగారె ! "[2] అని బసవఁడు ముగ్ధభక్తుల స్వభావమును బేర్కొనెను. వీ రితరభక్తులవలె వీరమాహేశ్వర వ్రతపారీణులై యున్నను ఆధికముగా సమాయకులు , నిరాడంబరులు. స్నిగ్ధ ప్రవృత్తి గలవారు. స్వచ్ఛమైన వాత్సల్యము. పారవశ్యముతోఁ గూడిన భక్తిభావము. వెన్నవంటి హృదయము. శివుని గాంచినంతనే ఆప్తునివలె, మిత్రునివలె, పుత్రునివలె భావించి ముగ్ధభావముతో గీర్తించి, సేవించి లాలించెడి స్నేహస్వభావము వారికి వెన్నతోఁ బెట్టిన సుగుణజాలము. వీరు శివునికొఱకై ప్రాణముల నైనను త్యజింపసిద్ధ మై త్యాగోత్సాహభక్తివీరు లై యొప్పువారు. రుద్రపశుపతి, నక్క నైనారు. బెజ్జమహాదేవి, గొడగూచి, దీపదకళియారు, నాట్యనమి త్తండి, ఉడుమూరి కన్నప్ప, కళియంబ నయనారు, సకలేశ్వర మాదిరాజయ్య, ముగ్ధ సంగయ్య మొదలగు ముగ్ధభక్తుల చరిత్రము లీ పురాణ తృతీయాశ్వాసమున వర్ణింపఁ బడియున్నవి.

వీరశైవము భక్తిప్రధాన మైన మతము. ఆభక్తి ఆవేశప్రధాన మై సాహసోపేతము లైన యద్భుతకార్యములచేఁ బ్రపంచిత మగు చుండును. వీరశైవులందు స్వీయమతాభినివేశ మెంత కలదో పరమతద్వేష మంత కాన

  1. ఆదిపురాణ సంగ్రహ పీఠిక. పుట 1 54 సంపాదకుఁడు : ఎల్ గుండప్ప ఎం.ఏ. మైసూరు విశ్వవిద్యాలయ కన్నడ గ్రంథమాల 29. (1959).
  2. బసవ పురాణము (సంక్షిప్తము) తృతీయ. 451 - 452 పంక్తులు.