పుట:Dvipada-basavapuraanamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii

వచ్చుచుండును. వీరశైవలక్షణములైన పంచాచార, అష్టావరణాదులను గ్రహించిన జంగముఁ డేకులములకు, ఏ వృత్తికిఁ జెందినవాఁ డైనను శివునివలె పూజనీయుఁడే ; సహపంక్తిభోజనాదుల కర్హుఁడే. ఇట్టి భక్తి సంప్రదాయము వీరశైవమత ప్రత్యేకతను వ్యక్తీకరించుచున్నది. సోముఁడు వీరశైవమతస్వరూప స్వభావములను స్పష్టపఱచునట్టి విధముగా భక్త కథాసంవిధానమును బసవపురాణమున నిర్వహించెను. వారందఱిలో సాత్త్వికుడుఁగా, అత్యుత్తముఁడుగా మహామహిమాన్వితుఁడుగా బసవేశ్వరుఁడు కానవచ్చుచున్నాఁడు. బసవేశ్వరుఁడు జంగమారాధన మొనర్చు వీరమాహేశ్వరవ్రతాచార్యుఁ డయ్యును అవతారపురుషుఁడనియు, శివునకును బసవనికిని భేదము లేదనియు నిరూపించుట యీ పురాణ తాత్పర్యము. శివభక్తి యన్నను. బసవభక్తి యన్నను భేదము లేదు. పరమశివుఁడే “తప్ప దేనతఁడని తర్కించిచూడ ! " అని పల్కియున్నాఁడు. శివుఁ డవ్య క్తలింగము; బసవఁడు సాకారలింగము. ఇట్లు బసవని శివునితో నభేద మొనర్చుటకై యీపురాణము పుట్టినది. సాకారలింగరూపుఁడైన బసవేశ్వరుఁడు వీరశైవులకు పరమ ప్రామాణికుఁడు ; వారిపురాణమున కతఁడే నాయకు డు. అతనియందు భక్త్యావేశము పరాకాష్ఠ నొందినట్లు సోమనాథుఁడు చిత్రించెను.

"వదిఁబారు జలమున కొఁడ లెల్ల కాళ్లు - వడిఁగాలు చిచ్చున కొడలెల్ల నోళ్లు
 వదివీచు గాడ్పున కొడలెల్లఁ దలలు - వదిచేయు బసవన కొడలెల్ల భక్తి.

ఇట్టినాయకుని వీరశైవ భక్తి చరిత్రము వర్ణింపఁబడిన పురాణము "భక్తి వీర" రసప్రధాన మనదగి యున్నది.[1] తద్రసపుష్టి సర్వాంగ సుందరముగా నిర్వహింపఁ బడునట్లు సోమనాథుఁడు కథలను తీర్చిదిద్దెను.

మతమునకు విశ్వాస మాధారము; శక్తి భక్తి, విశ్వాసము వీరశైవ భక్తుల యద్భుత మహిమల వలనను, వారు సాధించిన మతవాద విజయముల వలనను పఠితచిత్తమునం దేర్పడును. శివభక్తుల శివారాధన విధాన విశేషముల వలన భక్తి పఠితకు స్ఫురించును. అందును ముగ్ధభక్తుల చరిత్రములు హృదయ వాదులను , వీర భక్తుల చరిత్రలు బుద్ధివాదులను అధికముగా నాకర్షింపఁగలుగును. సోమనాథుఁడు బసవపురాణమున బసవని యుదాత్తచరిత్రము ముందుగా కొంత వర్ణించి యతనియందు ప్రామాణ్యబుద్ధిని పఠితకు కల్పించి, ముగ్ధభక్తుల చరిత్ర

  1. వీరరసము - జి. వి. సుబ్రహ్మణ్యం. పుట. 253.