పుట:Dvipada-basavapuraanamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiv

లచే పఠిత హృదయము నార్ద్రపఱచి భక్తి బీజములను నాటి, మడివాలు మాచయ్య వంటి వీరభక్తుల కథలు చెప్పి శివభక్తిసిద్ధివలన గలిగెడు మహిమలను గీర్తించి, అహంకార విరహిత మైన భక్తి ప్రపత్తిని పోషింపఁగలుగు దృష్టాంత రూప భక్తకథలను జెప్పియు, కిన్నర బ్రహ్మయ్య వంటిభక్తులకు శివుఁడు పిలిచిన పలుకు మహిమలు కలవనియు, ముసిడి చౌడయ్యవంటి భక్తులు ప్రాణ ప్రదాన సమర్ధు లనియు, ఏకాంత రామయ్య వంటి భక్తులు జైనాదులగు పరమతస్థులను స్వీయమహిమలచే నిగ్రహింపఁ గలుగుదు రనియు, షోడ్డలదేవు బాచయ్య కథ వలన పరమతఖండన శైవమత సంస్థాపన రూపమైన పరిజ్ఞానమును , శివనాగుమయ్యవంటి వారు శివభక్తి సిద్ధి కంత్యకులజు లైనను అర్హు లగుదు రనియు నిరూపించెను. భక్తియుక్తము లైన చిత్తములందే విశ్వాసము నిశ్చలమై నిలుచును. నిశ్చల మైన విశ్వాసము భక్తిని ప్రదీప్త మొనర్చును. కావున పరస్పరాశ్రితములైన భక్తి విశ్వాసములను సోమనాథుఁడు క్రమవికాస రమణీయముగా నిందు పొందుపఱచెను.

బసవపురాణమున నాయకుఁడు బసవేశ్వరుఁ డైనచోఁ బ్రతి నాయకుఁడు బిజ్జలుఁ డగును. బిజ్జలుఁ డొక వింతప్రకృతికలవాఁడు. బసవని వెలుఁగుక్రింది క్రీనీడవంటివాఁ డాతఁడు. వీరమాహేశ్వరాచారుల మహిమలు చెవులార వినుచు, కన్నులార గాంచుచు, బసవని పూజించుచు, తన్మతమును గౌరవించియు నాతఁడు మాత్రము వీరశైవుఁడు కాలేదు. అగుటకుఁ దగిన మౌలికగుణము - విశ్వాస - మతనికి లేదు. దానివలన భక్తి జనింప లేదు. లేనిచో విసమారగించి యపరగరళ కంఠునివలె నొప్పారిన బసవని చరితము ప్రత్యక్షముగఁ జూచిన తరువాత కూడ వీరశై వులకు నిష్కారణహాని తలపెట్టఁగలఁడా ? మహారాజైనను, మహాభక్తుని దనకొలువున బండారిగా నిలిపికొనిన పుణ్యాత్ముఁ డయ్యును, భక్తి బీజములు మొలకెత్తఁ జాలని శుష్కకఠినహృదయక్షేత్రము కలవాఁడు. అతనికిఁ గలిగిన కావ్యాంతమరణము సార్థకమే. శివాపరాధమునకు వీరశైవమున మరణమే దండనము కదా! మతపురాణమున మతమూల ప్రకృతులై న భక్తి విశ్వాసములు లేని కఠినునిఁ బ్రతినాయకునిగాఁ జిత్రించుట సోమనాథుని కథానిర్మాణ రహస్యము.

బసవపురాణమున బిజ్జల సంహార ఘట్టము చిత్రముగాఁ దీర్పఁబడినది. శివభక్తుల కపచారము కావించిన బిజ్జలుని శపించి కల్యాణకటకమును వీడి బసవేశ్వరుఁడు సంగమేశ్వరము చేరుకొనెను. జగదేవదండనాయకు నదివఱకే బిజ్జలసంహా