పుట:Dvipada-basavapuraanamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xi

పరినిర్వాణ మహోత్సవస్థానమున బసవని లింగైక్యము వర్ణింపఁబడినది. ఇవి యిట్లుండగా శైవమత సంబంధము లైన పంచాచారములును, అష్టావరణములును బసవ జీవిత వృత్తాంతమున బ్రతిబింబించునట్లు సోమనాథుఁడు కథాకల్పనలు గావించెను. ఇట్లు తీర్థంకర జీవిత కథాకథనమునందలి జైనపురాణ లక్షణములను స్థూలముగా గ్రహించి, ప్రజాదరణ సంపాదనార్థము వీరశైవ ప్రథమ పురాణమునందు ప్రవేశపెట్టినను బసవేశ్వర చరిత్రమును పాల్కురికి సోమనాథుడు స్వతంత్ర ప్రతిభతోఁ దీర్చిదిద్ది తన వ్యక్తిత్వము ప్రదర్శించెను.

బసవపురాణమున శివభక్తుల కథలు పెక్కు వర్ణింపఁబడినవి. ఆ భక్తులలో బసవేశ్వరునకు సమకాలీను లైన వారున్నారు. వారిలో అల్లమప్రభువు, ముగ్ధ సంగయ్య , మడివాలు మాచయ్య , సిద్ధ రామయ్య, సకలేశ్వరమాది రాజయ్య , కిన్నర బ్రహ్మయ్య, కన్నడ బ్రహ్మయ్య, కలకేత బ్రహ్మయ్య, మోళిగమారయ్య, ముసిడి చౌడయ్య, సురియ చౌడయ్య, తెలుగు జొమ్మయ్య. ఏకాంత రామయ్య, షోడ్డలదేవు బాచయ్య, సివనాగుమయ్య మొదలగువారు ముఖ్యులు. వీరుకాక పురాతన భక్తులు పెక్కు రీపురాణమున కెక్కియున్నారు. వారిలో చాలమంది ద్రవిడ దేశమున నయనార్లుగాఁ బ్రసిద్ధి చెందియున్న 'యఱువత్తు మావురి' లోనివారే. వారిచరిత్రలు తమిళమున పెరియపురాణమునందే కాక కన్నడమున హరీశ్వరుని శివగణదరగళె యనుగ్రంథమునందును, గాన నగు చున్నవి. వీనిని సోముఁడు యథావకాశముగాఁ దన పురాణమునఁ బొందుపఱచెను. అయినను సోమన భక్తకథ లన్నియు నొక మూలమునకుఁ గట్టుబడినవికావు : స్వతంత్ర కల్పనా ప్రాయములు. [1]

శైవసాహిత్యమున 'నఱువత్తు మూవురు ' భక్తుల కథ లెట్లున్నవో జైనపురాణములందు త్రిషష్టి శలాకాపురుష చరిత్రము లట్లున్నవి. జినధర్మమును నమ్మి సద్గతి వడసిన మహాపురుషులు అఱువది మువ్వురు కలరని జైన సంప్రదాయము. వారు 24 మంది జైన తీర్ధంకుల కంటె భిన్నులు; వారు: 12 మంది చక్రవర్తులు; 24 మంది కామదేవులు; 9 మంది బలదేవులు; 9 మంది నాసుదేవులు ; 9 మంది ప్రతి వాసుదేవులు. వీరికంటె తీర్థంకరులు శ్రేష్ఠులు. వారి

చరిత్రలు వర్ణింపఁ బడునప్పుడు పైశలాకా పురుషుల చరిత్రలు యథావకాశముగా

  1. బసవవురాణ పీఠిక : శ్రీ. వే. ప్రభాకరశాస్త్రిగారు. పుట 29.