పుట:Dvipada-basavapuraanamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

x

ములు వర్ణింపబడు నని అజితపురాణమునఁ జెప్పఁబడియున్నది.[1] అవి: 1. సురలోకావతరోత్సవము - లేక - గర్భావతరణ కల్యాణము 2. జన్మాభిషేకోత్సవము-లేక-జన్మాభిషేక కల్యాణము. 3. పరినిష్క్రాంత మహోత్సవము-లేక -పరినిష్క్రమణ కల్యాణము 4. కైవల్యబోధోత్సవము - లేక - కేవలజ్ఞానకల్యాణము 5. పరినిర్వాణ మహోత్సవము - లేక - పరినిర్వాణకల్యాణము. ఇందు ప్రథమకల్యాణకథాసందర్భములందు తీర్థంకరజీవ క్రమ వికాసవ్యంజకములగు పూర్వజన్మకథలు వర్ణితములగుచుండును. వీనిని “భవావళి "యని పిలిచెదరు. తీర్థంకరుల జన్మలకు పూర్వరంగము లైన యిట్టి కథలు పురాణకథావస్తువునకు పూర్వరంగము లై సురలోకావతరోత్సవము ప్రస్తావనాంగతుల్య మై జైనపురాణములందు కానవచ్చుచుండుటచే బసవేశ్వరపూర్వజన్మవృత్తాంత సంవిధానముపై వాని ప్రభావ మున్న దనుటలో విప్రతిపత్తి యుండదు. ఐనను జైన శైవమత సిద్ధాంతములలో సహజముగా నున్న భేదము ననుసరించి తీర్థంకరులు మానవ స్థితినుండి దేవస్థితి కారోహణక్రమమున గమించి సిద్ధు లై నట్లుగసు, బసవేశ్వరుఁడు ఆదివృషభరూపదేవస్థితినుండి కారణజన్ముఁడైన మానవుఁడుగా నవతరించినట్లును నిరూపింపఁబడెను. స్వీయమతానుగుణముగా పురాణనిర్మాణము చేయగల సమర్ధుఁ డగుటచే సోమనాథుఁ డీ కల్పనను ప్రశంసావహముగా నిర్వహించెను. ఇఁక మిగిలిన నాలుగు కల్యాణములును జైనతీర్థంకర జీవితవిధానాను గుణములే. కాని సోమనాథుఁడు వానిని కూడ కథానుగుణముగా మార్చుకొని మతాను గుణముగా కల్పించుకొనెను. అచ్చటి జన్మాభిషేకోత్సవపు తంతువేరు. ఇచ్చటి తంతు వేఱు. సంగమేశ్వరుఁడు ప్రత్యక్ష మై "ఈ భవమున కేన చూ గురుఁడ" నని చెప్పి లోకహితార్ధ మైన యాతని యవతార విశేషము నుగ్గడించుట, జంగమార్చనాది విశేషోత్సవములు జరుపఁబడుట మొదలగునవి బసవేశ్వరుని జన్మాభిషేకోత్సవ

విశేషములు. అందలి పరినిష్క్రాంతికి బదు లిం దుపనయనము మాని బసవన వీరశైవవ్రతదీక్షను గ్రహించుట వర్ణింపఁ బడినది. కైవల్యబోధోత్సవమునకు బదులు సంగమేశ్వరుఁడు బసవన కొనర్చిన ప్రబోధకథాఘట్టము నిర్వహింపఁ బడినది.

  1. "సురలోకావతరోత్సవం, పరికృతం జన్మాభిషేకోత్సవం, పరినిస్క్రాంత మహోత్సవం, ప్రవిమలం కైవల్యబోధోత్సవం, పరినిర్వాణ మహోత్సవం, జినమహా కల్యాణ మైదుం సవిస్తర దిందిర్పువు." -రన్నకవి.

    (చూడు:- ఆదిపురాణ సంగ్రహపీఠిక. పుట. 56 సంపాదకుఁడు: ఎల్. గుండప్ప. ఎం. ఏ.