పుట:Dvipada-basavapuraanamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

బసవపురాణము

“మనయింటఁ బండువుదినము నేఁ" డనుచుఁ
గనుఁగొని వధ్యశృంగారంబు సేసి
బాలుని ముక్తివిలోలు సిరాలు
లీలయుఁబోలెఁ దల్లియును దండ్రియును420
నిండారుమనమున లిహతుఁ గావించి
ఖండించి నానా ప్రకారము ల్గాఁగ
శాకంబు లొడఁగూర్చి జను లెర్గకుండ
శ్రీకంఠమూర్తిఁ జెచ్చెరఁ బిల్చి తెచ్చి
శ్రీపాదయుగళాభిషేకంబు సేసి
యాపాదజలము లత్యర్థిఁ బ్రాశించి
సంచితోన్నతసుభాసనమున నునిచి
మించి యర్చించి పూజించి వడ్డించి
యంగనయును పెట్టి సాష్టాంగ మెరఁగఁ,
బొంగి తాపసి శాకములు వేఱువేఱ 430
పరికించి చూచి యేర్పడ శిరోమాంస
మరపి యెయ్యెడఁ గాన కంత నిట్లనియె. :
“తలసూచియైనను దనయునిమీఁది
వలపు దక్కింపంగ వచ్చుఁ బొ మ్మనియొ
తల దాఁచుకొన్నారు; తగవయ్య : బాలు
తల గొని యిఁక మీరు ధన్యులు గారు ;
ఏమియు లేదు శిరోమాంస : మిట్లు
నేమంబునకుఁ జెల్లునే ? యాగమోక్తి !
దాన "సర్వస్య గాత్రస్య శిరః ప్ర
ధానం" బనెడుమాట గానేర దింక " 440
ననవుడుఁ బతియును నతివయు బెదరి
“యనఘ ! మహాత్మ ! యిట్లానతీఁ దగునె ?
యుపమింపఁ గేశదుష్టపరీతశాక
ముపహతం బనఁబడునో యని వెఱచి
పుచ్చితి ; మదియు నిప్పుడు చందనంగ
సెచ్చెరఁ జాకంబు సేసెఁ దా" ననుచు