పుట:Dvipada-Bagavathamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బాల్యము, పూతనాది రాక్షసమథనము మొదలగువాని నన్నిటిని నొక కాండములో కవి రచించి యుండునని నాయూహ. ఆ కాండము దురదృష్టవశముచే ఖిలమైపోయి యుండునని తలంచెదను. ప్రస్తుత పరిష్కరణ ప్రతి రెండవకాండమగు మదురాకాండముతో ప్రారంభమగుచున్నది. ఇది జరాసంధుని రెండవమారు దండయాత్ర కథతో నంతమొందుచున్నది. ఈ కాండము యొక్క మొదటిభాగము కొంత లుప్త మై పోయినది.

కల్యాణ జగదభిరక్ష కాండములలో నుత్తరభాగ కథలు చెప్పఁబడినవి. శ్రీకృష్ణుని వివాహములు, ఈ కాండల యందు వర్ణింపఁబడినవి. జగదభిరక్షకాండము శిశుపాల వధతో నిలచిపోయినది. ఇఁక నుత్తర భాగ కథలగు సాల్వమథనము, దంతవక్త్రసంహారము, కుచేలోపాఖ్యానము, సుభద్రా పరిణయము మొదలగునవి వివరించుచు మఱియొక కాండమును గూడ కవి రచించియే యున్నాఁడని నాధృడాభిప్రాయము. దుర్భాగ్యవశముచే నదియు మనకు లభింపలేదు. “అని సకలజనసమ్మతంబుగా నుపక్రమించి భాగవత దశమస్కంధంబును దెనుఁగున రచియించి యిచ్చి …….” అని వాసిష్ఠరామాయణములో వ్రాసి యుద్ఘాటించిన మడికిసింగనార్యుఁడు కొంతభాగమునే వ్రాసినాఁ డని చెప్పుట యుక్తమగునా?

కొన్నిచోట్ల గ్రంథాంతరమందు ద్విపదలలో నేకపాదము లున్నవి. ఇవి గ్రంథపాతములేమో యని మొదట నేను శంకించితిని. కాని పరిశీలించి చూచినప్పుడు అన్వయము చెడకుండ కథాభాగము నడుచుచున్నందున నా యేకపాద ద్విపదలనట్లే పూర్తి ద్విపదల క్రిందనే లెక్కించి వేసితిని. ఇట్టి లుప్తపాదములు కల శ్లోకభాగములు పూర్వగ్రంథములలోఁ బెక్కు లుండుట సహజమే.