విజ్ఞాననిధి యగు మహాకవి సింగనార్యుని విరచితమైన దీనిని పరిష్కరించుటలో నాయల్పీయమగు బుద్ధిని సాధ్యమైనంతవఱకు నరికట్టి మిక్కిలి శ్రద్ధగానే యుపయోగించితిని. యుక్తి కందుబాటులో నున్నట్టి కొన్ని లుప్తభాగములను బూరించి కుండలీకరణముగావించి పాఠకులకుఁ జూపి యున్నాను. వ్రాయసకాని ప్రమాదముచే నేర్పడిన గణభంగములను సవరించితిని. ఈ సవరణ కవిహృదయమునకు భంగముండదని విమర్శన జ్ఞానముతోనే చేయఁబడినదని మనవి చేసుకొనుచున్నాను. అన్వయము సరిగా కాని కొన్ని ద్విపద భాగములను సరిదిద్దిన పూర్తిగా క్రొత్తరూపము సిద్ధించునని తోచిన చోట్ల యథా మాతృకముగానే విడిచి వేసితిని. </p <p? బురదలో మాణిక్యమువలె, గుణగ్రాహకుల దృష్టికి మఱుఁగుపడి, ఈ ద్విపదకావ్యము సరస్వతీమహల్ లైబ్రరి అలమారలలోఁ బడియుండినది. దాని యునికిని, శ్రేష్టతను నాకెఱుక పఱచినవారు మన్మిత్రులును, బహుగ్రంథ ద్రష్టలును, విద్యానిధులును నగు బ్రహ్మశ్రీ నిడదవోలు వెంకటరావుగారు M. A. (Head of the Telugu Department Madras University) వారికి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతాభివందనము లర్పించు కొనుచున్నాఁడను.
శ్రీ మద్భాగవతము లో రసవంతమైనభాగము దశమస్కంధము. దీనిని సంగ్రహించి తెనుఁగు చేయుటలో మడికి సింగనార్యుఁడు కవితాశక్తితో పాటు విషయములను బెంచియో, క్లుప్తపఱచియో ఘట్టములను బ్రతిపాదించుటలోఁ దన విమర్శనా జ్ఞానమును జూపి యున్నాడు.