పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 17

భోజనశాలయైనది. నరసమ్మగారు వంటరియగుటచే ఆమెకు కావలసిన వస్తువులు తెచ్చియిచ్చుచు, నేనుకూడ ఆ విద్యార్థులతోకూడ భోజనము చేయుచుంటిని. నరసమ్మ గారు తెనుగువారి వంటలను రుచికరముగా చేయుటలో మంచి నేర్పరులు. నరసమ్మ గారికి సంతానము లేదు. దైవికముగా కల్గిన మా పరస్పర సన్నివేశము వలన ఆమెకు నాయందు పుత్రవాత్సల్యమును, నాకామె యందు మాతృభక్తియు కుదిరి పెంపొందినవి. నా తల్లిపోయిన వెంటనే ఈ విధముగా దేవుడు నాకు మరియొక తల్లిని చూపుట నా అదృష్టమే.

నేను చదువు చాలించుకొని ఉద్యోగంకొరకు ప్రయత్నించుచుండగా, బెంగుళూరు సమీపమునయుండు చిక్బళాపురము పోలీసు ఇన్సెక్టరుగారు మద్రాసుకు వచ్చియుండిరి. ఒకరు నన్ను పరిచయపరచిరి. వారు నాకు పోలీసు డిపార్టుమెంటులో యేదైన ఉద్యోగమును ఇప్పించెదనని వాగ్దానము చేసిరి. అందువల్ల వారిని పలుమారు కలుసుకుంటూ వచ్చితిని. ఇంతలో ఇన్సెక్టరు గారి కూతురికి పెండ్లి మద్రాసులోనే కుదిరెను.

ఆ పెండ్లికి నెయ్యి, చక్కెర వగైరా సామానులు కావలసి వచ్చెను. వారు ఈ ఊరికి కొత్త అగుటచే నన్ను తన్నెవరికైన సిఫారసు చేయమని అడిగిరి. అప్పడు అగ్రహారం ప్రక్కనయున్న మళిగె అంగడివానితో చెప్పి సామానులను ఇప్పించితిని గాని ఆయన డబ్బు యివ్వలేదు. అంగడివాడు ఆయన పేర పద్దు వ్రాసుకొని దానిపై నా చేవ్రాలుకూడ పెట్టమనెను. పెట్టితిని, పెండ్లికాగానే ఇన్స్పెక్టరు ఊరికివెళ్లి పైకమును పంపెదనని చెప్పిరిగాని పంపలేదు. నేను కూడా వారి ఊరికి వెళ్లి అడిగితిని, ఇప్పుడు పైకము లేదు; వెనుక పంపెదనని చెప్పి నన్ను సాగనంపెను. కొంతకాలము అంగడివాడు వేచియుండి కోర్టులో దావాచేసి మా యిరువురిమీద డిక్రీ పొంది నన్ను అరెస్టు చేయించి, అప్పుల జైలులో పెట్టించెను.