18 చిన్ననాటి ముచ్చట్లు
పగలు 10 గం౹౹లకు నన్ను జైలులో నుంచిరి. నేను సకాలమునకు భోజనమునకు రానందున నరసమ్మగారు నన్ను గూర్చి విచారించగ, నేను నిర్బంధములోనున్నట్లు ఆమెకు తెలిసి, ఆతురతతో గిన్నెలో అన్నమును తీసుకొని నడియెండలో నావద్దకు నడిచివచ్చినది. నన్ను చూచి నా అవస్థకు కన్నీళ్లు పెట్టుకొనుచు, కన్నకొడుకునకు వలె కనికరముతో ఆ దినమున నాకు అన్నముపెట్టిన ఆ చల్లనితల్లి దృశ్యమును నేను ఇప్పటికిని మరువజాలను. ఆ సాయంత్రమే నా బాల్యస్నేహితులగు అన్నం చెన్నకేశవులు శెట్టిగారు నా అవస్థను విని జైలుకు వచ్చి, నా బాకీ రూ. 150 లు చెల్లింఛి నన్ను విడుదల చేయించినారు. నేను ఆ నిర్బంధములో 6 గం౹౹ల కాలము గడపవలసి వచ్చినది.
పిమ్మట నేను ఉద్యోగమునకై పలువిధముల పాకులాడవలసి వచ్చినది. అప్పడు వేసిన ట్రాంబండ్లలో వుద్యోగమునకై ప్రయత్నించితిని; కాలేదు. ప్లీడరు గుమాస్తా పని ఒక నెల మాత్రమే చేస్తిని; అదియు తుదముట్టలేదు. కడకు ఏదియు కొనసాగలేదు. ఇతరులను ఆశ్రయించి ఉద్యోగమును సంపాదించుకొనుట అసాధ్యమైనదని తోచి ఆ కార్యమును విరమించుకున్నాను.