పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186 చిన్ననాటి ముచ్చట్లు

చిరుతిండ్లకు ఆశపడరు. గదిని విడచి షికార్లు పోరు. ఒకే రూములో యిద్దరు ముగ్గురుండినను సకృతుగ సంభాషించు కొనుచుందురు. మంచి స్నేహముతో మెలగుచుందురు. ఒకరుకొన్న పుస్తకమును మరియొకరు కొనక సర్డుకొనుచుందురు. ఇంటినుండి వచ్చిన డబ్బును దుబారాచేయక మిగుల్చుకొనుచుందురు. ఆటపాటలకు పోరు. తాంబూలమును ముట్టరు. ఒక విద్యార్థికి జబ్బు చేసినప్పుడు మరియొకడు హోటలుకుపోయి అన్నమును తెచ్చిపెట్టును. మరియొకడు ధర్మవైద్యశాలకుపోయి మందులను తెచ్చి యిచ్చును. ఆ కాలమున అనిబెసెంటు, గోక్లే, వివేకానంద మొదలగు గొప్పవారి ఉపన్యాసములు జరుగుచుండినందున, వాటికి వీరు తప్పక పోవుచుండిరి. ఈవిధముగ అరవ విద్యార్థులు పలు ప్రాంతముల నుండి పైపంచలతో వచ్చి పరీక్షలను గొప్పగ నిచ్చి హైకోర్టునందును, రెవిన్యూబోర్డునందును, కలెక్టరు ఆఫీసునందునేగాక విద్యాలయములందును వైద్యాలయములందును మరి అనేక సర్కారు సంస్థలందును కూడ నిండియున్నారు. ఆంధ్రదేశమున అరవ ఆఫీసరులేని జిల్లా లేదు.

ఆంధ్రవిద్యార్థులు అరవ విద్యార్థులవలెనే ఆ కాలమున మద్రాసుకు వచ్చి కాలేజి చదువును చదువుకొనుచుండిరి. ఈ వచ్చినవారిలో బ్రహ్మచారులు, గృహస్టులు, బిడ్డల తండ్రులు వుండిరి. నాకు తెలిసిన విద్యార్థులలో ఒక తాత కూడ యుండెను. ఈ తాత బి.ఏ.లో యొక పార్టును పూర్తిచేయుటకు 10 సంవత్సరములగ పరీక్షకు డబ్బు కట్టుచుండెను. తెలుగు విద్యార్థులు మద్రాసుకు వచ్చునప్పుడు మూడు నాలుగు ట్రంకుల నిండుగ సామానులను తెచ్చుకొనుచుండిరి. ఆ కాలమున హోల్డాల్ లేనందున పెద్ద పరుపులో కొంత సామాను నిమిడ్చి మోకుతోగాని మంచపు నవారుతోగాని గట్టిగకట్టి రైలులో తూకమువేయకుండ ట్రంకులతోకూడ తెచ్చుకొనుచుండిరి. వారు తెచ్చుకొనిన ట్రంకులలో ఒకదాని నిండుగ గుడ్డలు, మరియొక దానిలో పుస్తకములు, మూడవ