చిన్ననాటి ముచ్చట్లు187
ట్రంకు నిండుగ ఆవకాయ, మెంతికాయ, బెల్లపు మాగాయ మొదలగు వూరగాయలను, నిలవయుండు చిరుతిండ్లను తెచ్చుకొనుచుండిరి. నెల్లూరు, గుంటూరు ప్రాంతములనుండి దిగిన ట్రంకులలో గుడ్డలు, పుస్తకములతోకూడ అన్నములో పొడి, ధనియాల పొడి, ఎండుచింతాకు పొడి, తెల్లగడ్డల పాడి, కొరవికారము, నీళ్లు పోయకుండ నూరిన గోంగూర, చింతకాయ, మినుముల చింతపండు పచ్చళ్లు వుండెడివి. నిలవఉండు గారెలను, అరిశెలను, మణుగుబూరెను తెచ్చుకొనుచుండిరి. కొందరి పెట్టెలలో చుట్ట పొగాకు, పొడి బుర్రలు నుండెడివి. ఒక శివభక్తుడు లింగార్చనకు తనతో కూడ నల్లరేగడి మన్నును బుట్టనిండుగ తెచ్చుకొనెను. వీరు మద్రాసుకు వచ్చిన వెంటనే మంచి హోటలు యొక్కడున్నదాయని వెతుకుదురు. ఎక్కడైతే వేపుడు కూరలు, పచ్చళ్ళు, చాలినంత నెయ్యి వడ్డించెదరో అక్కడ ప్రవేశించెదురు. అయితే అక్కడ బాగా డబ్బు యిచ్చుకొనవలయును. వీరు యింటినుండి తెచ్చుకొనిన పచ్చళ్లను, వూరగాయలను హోటలుకు తీసుకొనిపోవుచుండిరి. వారి యిండ్లనుండి అప్పుడప్పుడు ఫలహారములు, పచ్చళ్ళు పార్మిల్సు వచ్చుచుండెను. అయితే ఆదివారమునాడు హోటలులో చేసిన వల్లిగడ్డల సాంబారును అరవవారితో కూడ వీరును జర్రుకొనుచుండిరి. ఆనాడు చేసిన ఉర్లగడ్డలకూర వీర్లకు చాలకుండెడిది.
ఒక నెల్లూరి విద్యార్థి వంటరిగ నుండజాలక భార్యను రప్పించి మాయింటిలోనే ఒక భాగమును అద్దెకు తీసుకొని కాపురమును పెట్టెను. మరియొక విశాఖపట్టణపు విద్యార్థి కూడ అటులనే చేసెను. వంగవోలునుండి వచ్చిన విద్యార్థి యొకరు వేదం వెంక్రటాయశాస్త్రిగారి బొబ్బిలినాటకములోని పాటలను, బిల్హణీయములోని పద్యములను తరుచుగ పాడుచుండిరి. మరియొకరు తేలుకుట్టినవారికి పోతన భాగవతమునందలి పద్యములను పాడుచు, మంత్రించుచుండెను.