25
నాటి విద్యార్ధులు
మద్రాసులో నేను కొంత ప్రయోజకత్వమును సంపాదించిన పిదప పచ్చయప్ప కాలేజీకి ప్రక్కనయుండిన బందరువీధి 9 నెంబరు యింటికి కాపురమును మార్చితిని. అక్కడనే వైద్యశాల కూడ యుండెను. ఈ బాడుగ యిల్లు పెద్దదగుటవలన మిద్దెమీద యొక భాగమును ఆంధ్రవిద్యార్థులకు బాడుగకు యిచ్చితిని. ఈ యింటి యెదురుగనే వైశ్య విద్యార్థుల వసతిగృహముండెను. ఈ మూడవ యింటిలో పచ్చయప్ప కాలేజి హాస్టలును అప్పడే పెట్టిరి. అరవ, తెలుగు విద్యార్థులతో మంచి పరిచయ ముండినది. వైద్య సహాయమునకు, చేబదులుకు నావద్దకు వచ్చుచుండిరి. ఈ పరిచయమువలన విద్యార్డుల విషయములను వ్రాయగలిగితిని.
అరవ విద్యార్థులు చదువుకొనుటకు మద్రాసుకు వచ్చునపుడు తమతోకూడ రెండు చొక్కాలను, రెండు తుండుగుడ్డలను, రెండు చుట్టుపంచలను, రెండు పై పంచలను, రెండు గోచులను తెచ్చుకొందురు. మద్రాసుకువచ్చిన వెంటనే చౌకగ భోజనమునుపెట్టు హోటలులో చేరుదురు. ఇద్దరు ముగ్గురు చేరి ఒక రూమును బాడుగకు తీసుకొని చదువుకొనుచుండిరి. అప్పుడప్పుడు వారు కాలేజి లైబ్రెరికిపోయి చదువుకొనుచుండిరి. వారి గుడ్డలను వారే వుతుకుకొనుచుండిరి. చాకలివానికి బట్టలను వేయరు. తెల్లవారగనే కొళాయివద్ద స్నానముచేసి, ఉతికిన బట్టలను కట్టుకొని భోజనమువేళకు హోటలుకుపోయి, అక్కడనుండి కాలేజికి పోవుచుండిరి. ఆ కాలమున కాలేజివిద్యార్థులు తలగుడ్డలను ధరించుచుండిరి. గనుక వీరు తెచ్చుకొనిన పైపంచను తలకు చుట్టుకొని పోవుచుండిరి. హోటలులో భుజించు భోజనము తప్ప