పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180 చిన్ననాటి ముచ్చట్లు

కనుబడెను. ఈ బాలురపాట వినిన పిమ్మట వీర్లకు నాచేతనైన సహాయమును చేయుటకు నిశ్చయించుకొని నాయింటనే ఉంచుకొంటిని.

పిల్లవాండ్లకు శర్మసోదరులని (Sarma Bros) పేరుపెట్టి గోక్లే హాలునందు, విక్టోరియా పబ్లీకుహాలునందును గొప్పవారి యాజమాన్యముతో పాట కచ్చేరీలు యేర్పాటు చేసితిని. ఆ సమయమున మద్రాసు ప్రముఖులలో కొందరు పిల్లవాండ్ల గానమును గురించి ఉపన్యసించిరి. మరునాడు వీరి కచేరీలను గురించిన ఉపన్యాసములు వార్తాపత్రికలవారు ప్రచురించిరి. అప్పటినుండి మద్రాసులో వీరిపాటకు పేరువచ్చి సంగీత సమాజములవారు వీర్లను ఆదరించుచుండిరి.

మైసూరు ఆస్థాన సంగీత విద్వాంసులగు బిడారం క్రిష్టప్పగారిని శర్మ సోదరులకు పరిచయపరచితిని. క్రిష్ణప్పగారు పిల్లకాయల గానమునువిని చాలా సంతోషించి వీర్లను మైసూరు దర్బారులోకి ప్రవేశమును కలుగచేసిరి. శర్మసోదరుల గానమును మహారాజులవారు (గతించినవారు) విని చాలా సంతృప్తులయి గాయకులకు గొప్ప బహుమానముల నొసంగిరి. ఒకటి రెండు కచ్చేరులు దర్బారునందు జరిగిన పిమ్మట ఈ పిల్లకాయలను క్రిష్టప్పగారికి వప్పగించి వీర్లను మీరు చక్కగ తరిఫీదు చేయవలయునని ఆజ్ఞాపించిరి. వీరు దర్బారు అతిథులుగ యుండుటకు తగుమైన యేర్పాట్లను చేయించిరి.

బ్రహ్మశ్రీ గాయక శిఖామణి హరినాగభూషణముగారు ఆంధ్రదేశమునకు చిరపరిచితులు. వీరు ప్లీడరు వృత్తిలోనుండి ఫిడియలును అభ్యసించి ప్రసిద్ద పురుషులైరి. అందరికీ సులభముగ అందరివలె అందుబాటులో లేకపోయినను దొరికినప్పడు సభ్యులను ఆనందింప చేయు పండితులు. బ్రహ్మవర్చస్సుగల వైదిక శిఖామణి, రామభక్తులు.