24
సంగీత పాటకుల పోషణ
నేను మద్రాసులో స్థిరవాసరమేర్పరచుకొని ఎగ్మూరులో స్వగృహమును నిర్మించుకొనిన పిమ్మట నా స్నేహితులు గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటరు రావు బహదూర్ కామరాజమన్నారు క్రిష్టరావుగారి వద్దనుండి ఒక సిఫారసుజాబును తీసుకొని ఇద్దరు బాలురు నావద్దకు వచ్చిరి. వీరి తండ్రి కొండలరావుగారు వీరికూడయుండిరి. వీరు నాకు దెచ్చిన జాబులో - ఈ పిల్లవాండ్రు విజయనగర ప్రాంతమునకు చేరినవారనిన్ని, కొంతకాలము ద్వారం వెంకటస్వామిగారివద్ద గాన విద్యాభ్యాసమును చేసినవారనిన్ని, మిక్కిలి పేదవారనిన్ని మద్రాసులో నా సహాయమును కోరివచ్చుచున్న వారనిన్ని వ్రాసియుండెను. మద్రాసుకు వచ్చుటకు రైలుచార్జిలేక మా వద్దవున్న హార్మోనియమును అమ్ముకొని ఇక్కడికి రాగలిగితిమని పిల్లవాండ్ల తండ్రి కొండలరావుగారు చెప్పిరి.
వీరి విద్యాభ్యాసమునకై తల్లిలేని పిల్లలను వెంటబెట్టుకొని తండ్రి కష్టపడుట చూచి నాకు వాళ్లమీద జాలి కలిగినది. వారు వచ్చినప్పడు సుమారు పగలు 10 గంటల కాలము. వాళ్లను వెంటనే స్నానమును చేయుడని, నాతో కూడ భోజనమును చేయమంటిని, భోజనానంతరము పిల్లకాయలను పిలిచి పాటను వినగోరితిని. చిన్నపిల్లవాడు (కామేశ్వరశర్మ) వీణ, గాత్రము సాధకమును చేసినవాడు. పెద్దవాడు గోపాలరాయశర్మకు ఫిడియలు సాధకము. వీరిరువురి కచ్చేరియు అరగంట కాలము వింటిని. చిన్నవాని గాత్రము వీణానాదము యేకమైనప్పడు గాంధర్వగానమనిన నిదియేయేమోనని నాకు తోచినది. చిన్నవాని ప్రాయమప్పడు సుమారు 12 సం|| ఉండవచ్చును. బాలప్రాయముగనుక వాని కంఠము కిన్నెరస్వరమును బోలియుండెను. రెండవ వాని ఫిడియలు వయసుకుమించిన సాధకముగ