చిన్ననాటి ముచ్చట్లు181
సంగీతముతో కూడ సాహిత్యమును అభ్యసించిన పుణ్యపురుషులు. ఈ కాలమున ఆంధ్రదేశమునకు వన్నెదెచ్చిన వాగ్గేయకారులు.
వారణాశి సుబ్బయ్య, ఘంటయ్య అని సోదరులు, ఒకరు గాత్రమున ఒకరు మృదంగమున నిధులు. వీరు మద్రాసుకు వచ్చి నన్నాశ్రయించినప్పుడు వీర్ల సంగీత సభను గోక్లేహాలులో యేర్పాటుచేసి జోడుతోడాలను ఇరువురకు తొడిగితిని. వీరిది బందరు కాపురస్థలము.
యజ్ఞనారాయణశాస్త్రిగారు అని యొకరు 1942లో కాబోలు నావద్దకు వచ్చిరి. వారు ఫిడేలును ద్వారం వెంకటస్వామిగారి వద్ద నేర్చితిమనిరి. వీరిని సంగీత శాస్త్రమున పేర్గాంచిన శ్రీ వెంకట్రామయ్యర్ గారివద్దకు తీసుకొనివెళ్లి వినిపించితిని. వారు ఆయనకు సంస్కారమును సాధనయు కలదని మెచ్చిరి. ఆ పిదప నాయింటనే యొకకచ్చేరీ గావింపించి అందు ఆయనను బంగారుపతకమును గొలుసుతో చేర్చి కంఠమున అలంకరింపజేసి సత్కరించితిని.
మద్రాసుకు వచ్చిన పిమ్మట అరవల సాంగత్యమువలన నాకున్ను క్రమముగ గానకళాభిమానము ఇనుమడించినది. మద్రాసులో జరుగు సంగీత కచ్చేరీలకు నేను తప్పక హాజరగుచుండెడివాడను. ఆ కాలమున మద్రాసులో నేటివలె సంగీత సమాజములుండినట్లు నాకు జ్ఞాపకము లేదు. ఎవరి ఇండ్లలోనైనను అగు వివాహ కార్యముల సందర్భములలో జరుగు పాటకచ్చేరీలకు పోవుచుంటిని, అప్పుడు పురుషుల కచేరీల కంటే స్త్రీల కచ్చేరీలే విశేషముగ జరుగుచుండెను. బెంగుళూరు నాగరత్నం, కోయంబత్తూరు తాయి, ధనకోటి, గోదావరి, సేలం చెల్లెండ్రు, రాజాయి మొదలగువారి కచ్చేరీలు విశేషముగ జరుగుచుండెను. వీణె ధనము గొప్ప విద్వాంసురాలైనను వివాహ కార్యములలో వీణికచ్చేరిని పెట్టించువారు చాలా