పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు163

ఊరిలో ప్రతియింట నొక్కొక్కరికి భోజనము పెట్టదురు. సత్యభామ వేషము వేయు స్త్రీ అందమైనది. కనుక అందరును తమ యిండ్లకు ఆమెనే భోజనమునకు పిలుతురు. ఆమె భోజనమునకు వచ్చిన గారెలు, బూరెలు, పరమాన్నములతో కూడ విందు చేసెదరు. అందువలన ప్రతియింటికి సత్యభామయే భోజనమునకు వచ్చునని వెంకటస్వామి కబురుపంపెడివాడు. కనుక జట్టు అందరికీ పిండివంటలతో విందు జరిగేది. నాటకమునాడు స్థలమునంతయు, సాయంకాలము వెట్టివాండ్రు చిమ్మించి నీళ్లుచల్లి బాగుచేయుదురు. రాత్రి 10 గం||లకు నాటకము ప్రారంభమగును. ఊరి ప్రజలందరు వచ్చి కూర్చుందురు. నాటకరంగమునకు ముందు కరణం మునసబులు ఇంక ననేకమంది బ్రాహ్మణులు, కాపులు, రెడ్డు కూర్చుందురు. వేషము యెప్పుడు వచ్చునాయని ఆత్రముతో వేచియుండెదరు. సాధారణముగ వీరు మొదట భాగవతనాటకమునే ప్రదర్శించెదరు. దీనిలో ముఖ్యపాత్రలు కృష్ణుడు, సత్యభామ, గొల్లభామ, సుంకర కొండడు మొదలగునవి. మొదటి వేషము (అది సామాన్యముగా భామవేషమో, రాజవేషమో) తెరచాటునుండి వెలుపలికి వచ్చునప్పుడు రెండు దివిటీలను ఆ వేషము మొగమెదుట మోటించి నిల్చి దానిపై గుగ్గిలపుపొడిని చల్లెదరు. ఆ వెలుతురున తెరలోని వేషము బయటపడును. ఈ వేషధారులు ధరించి యుండు ఆభరణములన్నియు తేలిక కొయ్యమీద చెక్కి కాకిబంగారము అంటించబడినవి.

సత్యభామ తన జడను తెర ఇవతలవేసిన 'తనను ఈ సభలో ఎవరైనను భాగవతవిషయమై ప్రశ్నించినచో జవాబు చెప్పగలను' అని సూచన. ఒక్క భాగవతముననే ఏమి? సామాన్యముగా నీ భామవేషమువేయు వ్యక్తి ఆనాటి సకల శాస్త్రములను తెలిసినదైయుండును. ఈ వేషమున పూర్తిగా యుపన్యసించుటకు ఒకటి రెండు రాత్రిళ్లు పట్టును. అందు శాస్త్రముల