Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164 చిన్ననాటి ముచ్చట్లు

నన్నిటిని తడవి వేషధారి తన విద్వత్తు ప్రకటించును. చూలింతయైన దేవకీదేవి పిండోత్పత్తిక్రమము, గర్భరక్షక విధులు, పురిటింటు సన్నాహము, బాలింత పథ్యపానములు, శిశుపోషణ పద్దతులు - మొదలైనవాని నన్నిటిని ఆయుర్వేద వైద్యశాస్త్రరీత్యా ఉపన్యసించును. సత్యభామ శృంగార రసమందలి సాత్వికావస్థలను, నాయికా నాయక లక్షణములను, ఉపన్యసించును. దీనినే భామ కలాపము అందురు. ఇదియొక విధముగ నాటికాలమున వయోజన విద్యావిధానము అనజెల్లును. పైవిధముగా నీ భామ తన జడను తెరలోపలినుండి రంగస్థలమువైపున తెర బయటకు జారవిడువగనే సభాసదులలో పండితోత్తములు ఆమెను భాగవతములోని పద్యములను, కృష్ణకర్ణామృతములోని శ్లోకములను చదివి భావార్ధముల చెప్పమని అడిగెదరు. అవి చెప్పినంతనే విడువక, ఇంకను భరతశాస్త్రము నందును, అలంకారశాస్త్రమునందును ప్రశ్నింతురు. నాటకము తెల్లవారి 5 గం||ల వరకు జరుగును. అటుపిమ్మట వారందరు ధరించిన వేషములతోనే గ్రామములో ప్రతియింటికి వచ్చి చీరెలను ధోవతులను భిక్షమెత్తెదరు. హరిశ్చంద్ర నాటకము, నలచరిత్ర, ఉషాపరిణయము, ప్రహ్లాదనాటకము మొదలైనవి ప్రదర్శించేవారు.

కూచిపూడి భాగవతుల వీధినాటకములలో ఆడవేషమునుగూడ మగవారే ధరించుదురు. వీరు రంగస్థలమునకు వచ్చినపుడు పురుషుడువేసిన స్త్రీ వేషములను గుర్తించుట సులభముగ నుండెడిది. వీరు బ్రాహ్మణులు గనుక భోజనాది వసతులు సులభముగ వూరిలో కుదిరేవి. మధ్యాహ్నపు వేళలో యెవరి యింటిలోనైన వేషములు వేయకుండ అష్టపదులు, కృష్ణకర్ణామృతములోని శ్లోకములు, తరంగములుపాడి, అభినయముపట్టి భరతశాస్త్ర ప్రదర్శన మొనర్చెడివారు. వీరిలో కొందరు గారడికూడ చేయగలవారుండిరి. తరంగములు పాడునప్పడు అద్భుతముగ నృత్యము