పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

తీర్థయాత్రలు

అలహాబాదులో 1910 సం|| డిశంబరు నెలలో కాంగ్రెసు మహాసభ జరిగినది. ఈ సభకు నేనును నెల్లూరినుండి పబ్లికు ప్రాసిక్యూటరుగ నుండిన శ్రీ మైదవోలు చంగయ్య పంతులుగారును, వెంకటగిరిరాజుగారి ఉన్నత పాఠశాలకు అప్పటి ప్రధానోపాధ్యాయులు శ్రీమాన్ ఏ. సంతాన రామయ్యంగారును, అభ్రకపు గని స్వంతదారులగు శ్రీ విస్సా లక్ష్మీ నరసయ్యపంతులుగారును వెళ్లితిమి. మహాసభానంతరము అక్కడ నుండి కాశీయాత్రకు వెళ్లితిమి. నేనును విస్సా లక్ష్మీనరసయ్య పంతులుగారును కుటుంబములతో బయలుదేరితిమి.

కాశీలో తీర్థవాసియగు పుచ్చా సుబ్రహ్మణ్యశాస్త్రి యింట బస చేసితిమి. వీరు పూర్వము రాజమహేంద్రవర ప్రాంతములకు చెందిన ఆంధ్రులు. చాలకాలమునుండి ఇక్కడనే స్థిరనివాసియై మంచి స్థిరాస్థిని సంపాదించినవారు. కొన్ని గృహములకు యజమానుడు. మమ్ములనొక గృహము నందుంచెను. వీరి వ్యాపారమును సాగించుటకు వీరివద్ద కొందరు గట్టివారు గుమాస్తాలుగ నుండిరి. వారిలో ఒక గుమాస్తాను మాకు అప్పచెప్పిరి.

'వారణాశి" అని కాశీకి మరొకపేరు. 'వారణా' 'అశి' అని రెండు ఉపనదులు కాశీకి రెండువైపుల ప్రవహించి గంగలో కలియును. ఆ రెండు నదుల మధ్యయుండుటచే "వారణాశి" అని ఆపట్నము నందురు. పట్నమంతయు అర్ధచంద్రాకారముగ నదిగట్టున పొడవుగా నుండును. పురాతన పట్నమగుటచే కాబోలు, ఎత్తయిన ఇండ్లతో, మేడలతో, ఇరుకు వీధులతో నిండియుండును. కావున తెలిసినవారి సహాయము లేనిదే కొత్తవారు ఆ పట్నములలో తిరుగజాలరు. నది పొడవున భవనములున్నవి.