పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110 చిన్ననాటి ముచ్చట్లు

ధనాధ్ధ్యులు పలు ప్రాంతములనుండి పిదప కాలమున వారణాశిలో నివసించి, అక్కడనే మృతిచెందిన - సరాసరి స్వర్గము చేరుదమని ఆ భవనముల కాపురముందురట. నది పొడవున పురాణ ప్రసిద్దములు చరిత్రాత్మకములు నగు అనేక 'ఘట్టము'లు కలవు. దశాశ్వమేధ ఘట్టము, హరిశ్చంద్ర ఘట్టము మున్నగునవి అట్టివే. ఇక్కడనే ఊరి మధ్య 'జ్ఞానవాపి' లేక 'కూపము' కలదు. యాత్రికులు ఆక్కడకువెళ్లి పూలు, పండ్లు అందువేసి పవిత్రులు, 'జ్ఞానవంతులు' నగుదురు. అయితే వారు అందువేసిన వస్తువులు కుళ్లి దుర్గంధములే అగుచుండును. 'గౌడిదేవిగుడి' యని - యొకటి హరిజనవాడ మధ్యనున్నది. ఎంతటి ఆచారవంతులైనను ఆ వాడకు అరమరికలు లేకుండా వెళ్లి గవ్వలుకొని ఆ గుడిలోవేసి వచ్చినగాని కాశీయాత్ర ఫలితము దక్కదు అని వాడుక. నది కావలిగట్టున కాశీమహారాజుగారు నివసింతురు. వారి ఆఫీసులు అక్కడనే యుండును. యాత్రికులలో నుత్సాహవంతులు కొందరు పడవలపై నది దాటి వానినన్నిటిని చూచివత్తురు. పలుదేశములనుండి పలువురు వచ్చి పోవుచుందురుగాన పట్టణమున 'గల్లీ'లు (వీధులు) చాల అపరిశుభ్రముగా నుండును.

'నఃమణి కర్ణికాసమంతీర్థం - విశ్వేశ్వర సమంలింగం -

నఃకాశీ సదృశీపురీ - నాస్తి బ్రహ్మాజ్డ గోళకే'

అను పూర్వుల సుభాషితము. మహమ్మదీయులకు మక్కా, క్రీస్తువులకు జరూసలము, బౌద్దులకు బుద్దగయ ఎటులనో హిందువులకు కాశీక్షేత్రము అటువంటిది. 'కాశ్యాంతు మరణాత్ ముక్తిః' ప్రాణ ప్రయాణ సమయమున కాశీక్షేత్రమునందే నివసించి మరణించవలయుననే అభిలాష అనేకులకు గలదు. కాశీయాత్ర చేయుటకు రైలు సౌకర్యములు లేనికాలమున అనేకులు తమ ఆస్తులను గురించి తగు యేర్పాటులను చేసి బంధువులకును ఊరివార్లకును అప్పగింతలుచెప్పి కాశీకి ప్రయాణమవుచుండిరి. కాశీ