పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108 చిన్ననాటి ముచ్చట్లు

పెద్దప్రహరీగోడను కట్టి అక్కడ వీరు నివసించుటకు నిర్బంధమగు యేర్పాట్లు గలవు. ఈ యింటివాకిట సిపాయి పారాకూడ కలదు. వీరు నివసించు యింటినుండి దేవాలయమునకు పోవుటకు ప్రత్యేకమైన సందుదోవను యేర్పాటుచేసి వున్నారు. ఈ అర్చకులు రాత్రి 3 గంటలకు నిదురలేచి వారు నివసించు ఆవరణములోని గుంటలో స్నానమును చేసి, అనుష్టానములను తీర్చుకొని దేవతార్చనకు పోయెదరు.

ఈ దేవునకు ప్రతి సంవత్సరము 'పూరం' అను ఉత్సవము జరుగును. ఈ ప్రాంతమున కెల్లను ఇది గొప్ప తిరునాళ్ళు. ఈ ఉత్సవములో విశేషమేమన 12 గొప్ప ఏనుగులను బంగారు తొడుపులతో అలంకరించి దేవుని వూరేగించెదరు. కొచ్చి రాజ్యము గొప్ప ఏనుగులకు ప్రసిద్ధము. ఈ యేనుగులు దేవాలయమునుండి బారుతీరి సోల్జర్లు (Soldiers) నడిచినట్టు అడుగులను వేయుచు నడుచునప్పుడు ఆ దృశ్యము అద్భుతమును గలుగ చేయును. ఇటువంటి వుత్సవము మరి యెక్కడను వుండదు. ఈనాడు రాత్రి స్వామికి బాణవేడుక జరుగును. ఈ బాణవేడుకను రెండు కక్షలవారు ఒకరికంటె ఒకరు బాగుగ చేయవలెననే యేర్పాటును చేయుదురు. ఇందుకు వీరు చాల ధనమును ఖర్చు పెట్టుదురు. రాత్రి 10 గంటలు మొదలు తెల్లవారి 5 గంటలవరకు బాణవేడుక జరుగును.