పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

చాటుపద్యరత్నాకరము

సీ. దాతతో నర్థులతారతమ్యముఁ దెల్పి
               యిప్పింప నేర్చుఁ దా నీయ నేర్చు
   నవరసాలంకారనయకవిత్వప్రౌఢిఁ
               దెలియనేర్చును మూఢుఁ దెలుప నేర్చు
   భట్టసంఘట్టఘరట్టవాగ్దిట్టయై
               చదువఁగా విన నేర్చుఁ జదువ నేర్చు
   మానుషాధిపులైన మానవాధీశుల
               మెప్పింప నేర్చుఁ దా మెచ్చ నేర్చు
   దాత కవి భట్టు మంత్రియుఁ దానె యగుచు
   మంతు కెక్కెను ధారుణీమండలమున
   సరసహృదయుండు! వినుకొండశాసనుండు!
   భవ్యభరతుండు! రాయనభాస్కరుండు!

సీ. నీదేవదేవుండు నిజభక్తరక్షాప
               రాయణుం డాదినారాయణుండు
   నీతాత జగదేకదాత రాయనమంత్రి
               భాస్కరాన్వయుఁ డైన భాస్కరుండు
   నీతండ్రి వితరణఖ్యాతినిఁ గలియుగ
               కర్ణుండు రామలింగప్రధాని
   నీతల్లి పతిహితనీతి నరుంధతీ
               దేవితోఁ బ్రతివచ్చు తిరుమలాంబ
   తనర వెలిసితి వత్యంతవినయవిభవ
   గురుతరైశ్వర్య మహనీయగుణగణాఢ్య!
   సరసహృదయుండ! వినుకొండశాసనుండ!
   భవ్యభరతుండ! రాయనభాస్కరుండ!