పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయతరంగము

91

   స్నానమాడంగఁ గడియంబు జారఁ గడమ
   కడియమును వేయ శాంభవి కరముఁ జూపె
   వెలయరాయల కుంగ్రమ్ము వేసి చూపె
   సర్వమాన్యుండు వినుకొండశాసనుండు
   భవ్యభరతుండు రాయనభాస్కరుండు.

సీ. శ్రీగిరిప్రాగ్దిశశ్రీల కానాలమై
               విలసిల్లు విరిదండ విన్నకొండ
   విబుధాధిరాణ్మౌళివిశ్వంభరవ్రజ
               విజయధాటికి జెండ విన్నకొండ
   వేదవేదాంతవిద్యావిచక్షణ
               విదవజ్జనులకండ విన్నకొండ
   రాయనభాస్కర ప్రాంచత్ప్రధానుండు
               విత్తము లిడుకొండ విన్నకొండ
   కొండవీడాది పెనుగొండ గోలకొండ
   కొండపలిసీమ మేలైనకొండవీడు
   దుర్గముల కెల్ల బలుదొడ్డ దొడ్డకొండ
   భాస్కరునికొండ వినుకొండఁ బ్రబలుచుండ.

క. ఏకొండయు వినుకొండకు
   రాఁగోరదు సాటి పోటి రా నేరదుగా
   చేకొని రాయనిభాస్కరు
   డేకోన్నతవృద్ధి మీఱ నేలుట చేతన్.

క. ఆవినుకొండకు రెండవ
   దేవేంద్రుఁడు భాస్కరుండు దీపించె భళీ
   ఏవేళ నర్థికోటికిఁ
   గావించుచుఁ గనకవృష్టి కడుఁ జోద్యముగన్.