పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయతరంగము

93

క. వగ గల్గి యర్థి కీయని
   మొగముండల కేల మొలిచె మూతిని మీసల్
   తెగగొరుగఁ డాయె మంగలి
   రగ డొందగఁ గీర్తికాంత రాయనిబాచా!

క. మీఁగాలుబంటినీటికి
   నీగుదు “రమక్క” యనుచు నిలలో వనితల్
   వేగమె దాటెఁ బయోధుల
   ఱాగ భవత్ కీర్తికాంత రాయనిబాచా!

సీ. రంగత్కృపాదృష్టి గంగాభవానికి
               మణికంకణంబు లేమంత్రి యొసఁగె
   భిక్షార్థ మీయఁగా నక్షయం బగునట్లు
               మార్తాండుఁ డర్థ మేమంత్రి కొసఁగెఁ
   దగ వేఁడినంతలో జగతిపై నర్థికి
               మానంబు ప్రాణ మేమంత్రి యొసఁగె
   మీసంబు తాకట్టు వేసి పదార్థంబు
               మహిమచే నర్థి కేమంత్రి యొసఁగె
   అతఁడు నందవరీకవరాన్వయుండు
   దుర్ఘటుండు వసిష్ఠగోత్రోద్భవుండు
   శత్రుమథనుండు వినుకొండశాసనుండు
   భవ్యభరతుండు రాయనిభాస్కరుండు.

రామలింగభాస్కరుఁడు

రామలింగభాస్కరుఁడు రాయనిభాస్కరునకు మనుమఁడు. ఈవిషయము ఈక్రిందిపద్యమువలనఁ దేలుచున్నది.