పుట:Chanpuramayanam018866mbp.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

111


సీ.

అటులు గాదేని ఖరాసుకదూషణత్రిశిరఃప్రముఖదైత్యదేహరక్త
పటలమేదోమాంసపంకిలముఖము లై మొనయురాఘవశిలీముఖములకును
నైజగాత్రక్షరన్నవశోణితమునఁ బ్రక్షాళనం బెవ్వఁడు సలుపఁగలఁడు
నీవు దక్కఁగను వెండియు నఖండితశాతసౌమిత్రిపటుపత్రిచాతకముల


గీ.

కేఘనుఁ డమర్చు నభినవాసృక్పరంప, రారనవదంబుధోరణి పారణంబు
ననుపమపవిత్రచారిత్రఘనపులస్త్య, కులపయోరాశికాకోల కుటిలశీల.

42


గీ.

పంచబాణవిభిన్నుఁడౌ పంచముఖుని, నిందుముఖి యేకవాణియుఁ బొందదయ్యెఁ
బంచవక్త్రాహిదష్టుఁడౌ పంచజనుని, వినిహతవిషార్తి యౌషధి మనుపఁగలదె.

43


సీ.

ఈ తెఱంగునఁ బల్కు సీతానతోదరి యవధీరణోక్తుల నవధరించి
కినుకచే విముఖుఁడై తనరుపంక్తిముఖుండు తత్కాంత చెంత సంతతమునుండు
కావలిపడతులఁ గనుఁగొని మీరీనృపాంగనఁ జతురుపాయములచేత
వశ్యఁగాఁ జేయుఁ డవశ్యంబు నటుగాని, తఱి వీహతాశ నిత్తలిరుఁబోణిఁ


గీ.

బ్రాతరాశంబునకు వేగఁబాకశాల, గుణుల కొప్పించుఁ డనుచు దుర్గుణగరిష్ట
తానిధానంబు కుమతియై యానతిచ్చి, యంతట నిశాంత మగుడు నిశాంత మొందె.

44


సీ.

తదనంతర ముదారదారుణవీక్షణక్షణదాచరాంగనాజనకఠోర
వచనదోషోన్మేషవశముకుళీకృతహృత్పుండరీక యై యినకులాధి
నాథునికూరిమినారీశిరోమణి యాభీలపుండరీకావృత యగు
రమణీయసారంగరమణిచందమునఁ దాపసదత్తఘోరశాపంబువలన


గీ.

వసుమతీభాగమందు గీర్వాణతరుణి, కరణి నత్యంతదీనతాకలిత యగుచు
బంధుజనహైన్యపరితాపభరముచేత, నెంతయును జింతిలఁదొడంగె నివ్విధమున.

45


క.

నావృత్తాంత మెఱింగిన, యావిహగాగ్రణి జటాయు వటవి నిలిగెనే
మో విన్నవాఁడు కాఁ డటు, గావున నాయునికి నిచటఁ గాకుత్స్థుండున్.

46


క.

రక్కసుల పెక్కుమాయల, జిక్కువడినయార్యపుత్త్రు చేతోభువియం
దక్కట యాస్థ గణింపఁగ, నొక్కింతయుఁ బొడమదయ్యెనో నెయ్యమునన్.

47


క.

న న్నపహరించి తెచ్చిన, యన్నీచాత్మకుఁడు సహజ మగు రాముకృపా
భ్యున్నతి హరించెనో కా,కున్నఁ బ్రపన్నావవనుఁ డతఁ డూరక యున్నే.

48


వ.

ఇవ్విధంబున నవ్వధూలలామ బహువిధంబులుగఁ బరిదేవనం బొనర్చి యంతరంగంబున రఘుపుంగవుం గని సంతతంబునుం జాతించుచు మూర్ఛాక్రాంత యై యున్న సమయంబున.

49