పుట:Chandrika-Parinayamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాధపడుచుండఁగాఁ గుముదుఁడు “మహినాయక! యేల చింతించెదవు? నిన్నుఁ బ్రేమతోఁ జూచిన యా వధూమణిని మన్మథుఁడింతకు ముందే తనసూనబాణములచే నీయందు సమగ్రమనోరథను జేసి యున్నాఁడు. ఆమె నిన్ను తప్పక వరించును. చింత యెంతమాత్రము నీకవసరము లేదు” – అని చెప్పఁగా సుచంద్రుఁడు కుదుటపడి, విమానముపై నెక్కి, తనసైన్య మున్నచోటికి వచ్చి, కుముదుని కూర్మిమీరఁగాఁ బంపెను. పిమ్మట ముని కిచ్చిన తనవాక్కును దలఁచుకొని తమిస్రదానవుని వధించుటకై సైన్యసమేతముగాఁ బయలుదేరెను.

రణభేరిని మ్రోగించుచు హిమవత్పర్వతమును జేరిన సుచంద్రుఁడు రాక్షసునినగరమును ముట్టడించి, కరిఘీంకారములు, అశ్వహేషలు, రథనినాదములు, సైనికులవీరాలాపములు చెలరేఁగ రాక్షససైన్యమును దుత్తునియలు చేసెను. వీరాధివీరుఁడగు తమిస్రాసురుఁడు పెక్కు దుర్భాషణము లాడుచు సుచంద్రుని లెక్కింపక రణరంగమున విహరించుచుండఁగాఁ దనధనస్సున నారాయణాస్త్రమును సంధించి వానితల నఱికెను. ఆరాక్షససంహారమును గాంచిన దేవతలు, యక్షులు, కిన్నరులు, మునులు, నరనాథులు, సైనికులును ఆనందించిరి. ఇంద్రాదిదిక్పాలు రానందించి పెక్కుపారితోషికము లిచ్చిరి. సుచంద్రునివైపున యుద్ధ మొనరించి మరణించినవారి నందఱిని ఇంద్రుఁడు అమృతధారలు గురిపించి మరలఁ బ్రతికించెను. మునులు రాజున కభ్యుదయ పరంపరాభివృద్ధి యగునట్టు లాశీర్వదించిరి. సుచంద్రుఁడు ప్రతిజ్ఞ నెరవేరినందులకు సంతసించుచు, తిరుగుప్రయాణమునఁ గనుపట్టుచున్న ప్రకృతిచిత్రము లన్నిఁటియందును చంద్రికాసౌందర్యము నూహించుచు నాయింతి నెప్పుడు చేపట్టగలనో! యను చింతతో స్వనగరమును జేరి, యేకాంతమున విరహవేదనతోఁ బవ్వళించెను. అనురాగాతిశయముచేతఁ జంద్రికను దలంచుచుండఁగా సుచంద్రునికి దేహమందుఁ బులకలు, లోచనములం దశ్రువులు బొడముచుండెను. ఇఁక నక్కడ సుచంద్రునిపై మోహము బొడమిన చంద్రికకు నవపల్లవాద్యుద్దీపకదర్శనమువలన ఆకులత్వము గలిగెను. శుకకూజిత భ్రమరఝంకారాదులచేత సంతాపము మిక్కిలి యుప్పొంగెను. పికధ్వనులయం దరతి గలిగెను. కార్శ్యముచేతఁ గరకంకణములు, దైన్యము చేత నయనాశ్రువులు జాఱెను. సఖీవిరచిత సుచంద్రచిత్రవీక్షణమునఁ బ్రత్యక్షప్రియసంగమము నప్పుడప్పు డనుభవించుచుఁ గొంత యూరటఁ జెందు