పుట:Chandrika-Parinayamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుండెను. కాని మరల నుద్వేగము, మరలమరల యరతి మొదలగు ననంగదశలకు లోనై విరహవేదనాదో దూయమానచిత్తయగు చంద్రికను, వసంతోదయ మగుటవలన చెలులు కేళికావనమునకుఁ దీసికొనిపోయిరి. కాని యచ్చటను గోకిలాలాపములు, నవపల్లవములు, మందమారుతము, ఆమెను బాధించుచునే యుండఁగా, జలక్రీడ లామె ప్రియవియోగదుఃఖము నినుమడింపఁజేయఁగా, సఖులు, మన్మథపూజవలన నీవిరహబాధ శమించునని యూహించి, సాంగసపరివారముగ కుసుమాస్త్రునిఁ గల్పించి, ఆవాహనార్ఘ్యమజ్జనాది పూజలు చేయించిరి. అదియు ఫలింపక పోగా మరల కేళికాగృహమునకుఁ దోడ్కొనిపోయిరి. సూర్యాస్తమయముల సౌందర్యము లెంత వర్ణించినను చంద్రిక సుచంద్రునిదక్క మరియొక యుపాయమున యూరటఁ జెందఁజాలదని యెఱిఁగిన సఖులు క్షణదోదయమహారాజున కెఱింగింపఁగా నతఁడు తనకూతురు సుచంద్రనరపతి యెడలఁ బ్రేమ గలిగియుండుట శుభోదర్కమని భావించి, ఆమె యిష్టార్థసంసిద్ధికై చంద్రికాస్వయంవరమహోత్సవమును జాటించుట కాత్మానుచరులను బంచెను. రాజభటులు సకలదిఙ్మండలములందుఁగల రాజధానులయందు చంద్రికాస్వయంవరమును జాటించిరి. ఆయా రాజకుమారులు చంద్రికను వరింపఁదలఁచి బయలుదేరిరి. సుచంద్రుఁడును పురకాంతలు పుష్పాక్షతలు చల్లుచుండఁగా, విప్రులు దీవించుచుండఁగా, భూషణభూషితాంగుఁడై యొకమదగజము నెక్కి బయలుదేరెను. అట్లు స్వయంవరమునకై వచ్చిన రాజులనందఱిని పాంచాలభూపతి యెదుర్కొని రత్నమయనివేశస్థానములందు దించెను. సకలసౌకర్యములు గలిగించెను. మంచాధిష్ఠితుఁడైన సుచంద్రుఁడు తన సౌందర్యాతిశయముచేత నితరరాజకుమారులకుఁ దమను చంద్రిక వరించునో, లేదో, యను సంశయమును బుట్టించుచు నందఱిలో మణి యనఁదగినట్లుగా నుండెను. సర్వాలంకారశోభితమైన స్వయంవరమండపమున నిలిచి, తన తనయను రాజన్యులకు, రాజన్యులను దన తనయకుఁ బరిచయముఁ జేయుటకు జగజ్జనని పార్వతిదక్క మరియొక్కరు సమర్థులుగారని యెంచి, యాతల్లిని పరిశుద్ధమనస్కుఁడై ప్రార్థించెను. శిరమునఁ జంద్ర లేఖయు, కనులలో దయారసమును, మందస్మితమును, ఫాలలోచనమును, చనుగవ నొరయు ముత్తెపుసరులును, బంగరు వస్త్రమును, పరిమళించు నంగలతయు గలిగి, యందఱు