పుట:Chandrika-Parinayamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జూడఁదలఁచి యతనియాజ్ఞను గొని వచ్చితిని. ఈచంద్రికను జూడఁగా నీయమ ఆరాజునకే తగును. ఆనరనాథుఁ డీజలరుహనేత్రకే తగునని నామనస్సునఁ దోచుచున్నది. కనులు వికసిల్లగా నాజనాధీశచంద్రుని జూచినఁగాని నాకోరిక తీరదు. మీరు సైతము త్వరలో నతని జూడఁగలరు” అని పలుకఁగాఁ జకోరి, “సూర్యవంశసంజాతుఁడగు నాయుత్తమనాయకుని గుణములను విని మేము వర్ణింపఁగాఁ జంద్రిక యాపతిని జూచుటకై యువ్విళ్ళూరుచున్నది. మాకును జూడ బుద్ధిపుట్టుచున్నది. ఎట్లా సుందరాకారునిఁ జూడఁగలమో తెల్పుము” అనఁగా కుముదుఁడు మీకు వాంఛ గలిగియున్నచో నాచేతివైపున చూడుడు” – అని యంతవఱ కావహింపఁజేసిన తిరస్కరిణీ విద్యాప్రభావమును దొలఁగింపఁగా, మన్మథుని మించినసౌందర్యరాశియగు సుచంద్రుఁడు విమానమునఁ గూర్చుని దర్శన మీయఁగా మేను పులకలచే నిండ, మనస్సున వలపు నిలువ, చూపున ననిమేషవిస్ఫురణము గలుగ, ప్రమోదము చిందులు ద్రొక్క, మణిపీఠమునుండి దిగి, ఒకచెలిచేతిని కైదండబూని ఆచంద్రిక యారాజకుసుమాస్త్రుని ఒకింత సిగ్గుతోఁ జూచెను. ఆ రాజుచూపులు తెల్లనిగంగాప్రవాహమువలెఁ జంద్రికపైఁ బ్రసరింపఁ జంద్రికచూపులు చేపలవలె నెదురెక్కుచుండ వారిద్దఱును పరస్పరప్రేమవీక్షణములు చేయుచు రాగరసనిమగ్ను లైరి. సుచంద్రుని యొక్కొక్క యవయవమే యనేక నల నాసత్యస్మరాదులను దలపించుచుండఁగా వారిపోలిక యితనియెదుట చెల్లదని ఆపల్లవాధర భావించుచుండెను. అట్లు మోహపరవశమై యున్న చంద్రికవద్ది కొకచెలి వచ్చి, “రాజకుమారీ! మీతల్లి నీవీణను వినఁగోరి నిన్ను రమ్మని యాజ్ఞాపించినది” అని చెప్పఁగా నామె గురుని వినయముతోఁ గాంచెను. గురువగు కుముదుఁడు “ఓకిన్నరకంఠి! ఈనృపతికి నీవు సతివౌదువు. నా మాట తప్పదు. వెళ్ళిరమ్ము” అనఁగా గురునియాశీర్వచనమును గొని చంద్రిక తనమాత సన్నిధికి వెళ్ళెను. సుచంద్రుఁడు స్వప్నమువలె జరిగిన యీసంఘటన కుద్భ్రాంతచిత్తమున వియోగచింతాభరభరితహృదయుఁ డయ్యెను. చంద్రికాయత్తమనస్కుఁడై శారికాశుకముల పల్కులను చంద్రికామధురభాషణములుగాను, బండిగురివెంద విరిగుత్తిని చంద్రికచనుదోయి గాను, తదితరములగు ప్రకృతివైభవములను చంద్రికాసౌందర్యవిశేషములుగాను భావించుచు, నామె యేగిన దారినిఁ గాంచుచు, నామె లావణ్యవిశేషములనుఁ దలఁచుచు వలవంతలోఁ జిక్కి