పుట:Chandrika-Parinayamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గానచాతురికి శిలలు గఱుగఁగా మణిపుత్రికలు తల లూపఁగా, లయశ్రుతులయందు సఖులు పారవశ్యమును జెందియుండఁగా, వృక్షలతాదు లానందమునఁ జిగుర్పఁగా విపంచీనాదమునఁ గంఠస్వరమును మేళవించి గానము చేయుచున్న కనకగాత్రి యగు చంద్రికను అద్భుతాశ్చర్యములు నిండిన నిండుమనస్సుతో రాగరంజితములగు వీక్షణములు నిగుడించి చూచెను. ఆ వీక్షణమువలన నతనికి మేను చెమర్చెను. పులకలు రేకెత్తెను. స్తంభోదయ మయ్యెను. చూపులు నూగారుద్వారా స్తనపర్వతములపై నిలిచి దిగకుండెను. ముఖసుధాపానపారవశ్యమున ననిమేషత్వమును బొందెను. అట్లు చంద్రికాయత్తదృక్చకోరుఁడైన సుచంద్రుఁడు, తన మనస్సున ఈ హేమగాత్రి క్రొత్తగా సానదీరిన మన్మథునిఖడ్గము గాబోలు. ఔర! యీ చెలువచెలువము! అయ్యారె! ఈపొలఁతి యొయ్యారము! అని తదేకతానమనస్కుఁడై పొగడెను. అప్పుడు కుముదుఁడు రాజా! చూచితివిగదా! నాపలుకు నిజమేకదా! ఇఁక నేను వెళ్ళి ఈకొమ్మకు త్వదేకమతని గలిగింతు నని సుచంద్రునియాజ్ఞను గైకొని, విమానము డిగి తరులతామార్గములను దాటి, తాను సింహత్వమును బొందకమున్నున్న రూపవైఖరితోఁ జంద్రిక యున్నచోటికిఁ జేరఁగా, సఖులందఱు నబ్బురపడి గురుప్రముఖుఁడు వచ్చెసుమా! యన చంద్రిక సఖీయుక్తముగా నెదురేగి నమస్కరింపఁగా పెండ్లికూఁతురవు గమ్మని యాశీర్వ దించి, వారు చేసినపూజలు గైకొని, వారేర్పరచిన రత్నపీఠముపైఁ గూర్చునెను. అప్పుడు చంద్రిక చెలికత్తెయగు చకోరి కుముదునిఁ జూచి “మీరింతకాలము రాకపోవుటచే మేము మిక్కిలి చింత నొందుచు నిదిగో వత్తురు, అదిగో వత్తురని ప్రతీక్షించుచు నుంటిమి. ఏల యింతకాలము రాకపోయితిరి? ఏపురమున నుంటిరి? ఏయే విశేషములను జూచితిరి? ఏరాజుతోఁ జెలిమి చేసితిరి? దయతోఁ దెల్పుడు” అని కోరఁగా కుముదుఁడు చకోరిని జూచి మధురోక్తులతో “మహాపరాక్రమవంతుఁడగు సుచంద్రుఁ డను నొక రాజచంద్రుఁడు గలఁడు. సరసకలాంచితాస్యుఁడు, చారువిలోచనపద్ముఁడు, కళంకరహితగాత్రుఁడు నగు నానృపశిఖామణిని నాగకన్యలు, దేవకన్యలు, మానవకన్యలు గోరి పంచశరవేదనను భరింపఁజాలకుందురు. అట్టి సుగుణఖనియు, సుందరాకారుఁడును, సుక్షత్రియవతంసుఁడునైన యతనిమైత్రి గలిగియుంటిని. ఇప్పు డీ మీచెలిని