పుట:Chandrika-Parinayamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభలో నేనెఱిఁగిన శాంబరీవిద్యచేత నేనును ఒక మునితల్లజునై కూర్చుంటిని. ఇంతలో నా యువతిభర్త యచ్చటికి వచ్చి నామాయావిత్వము నెఱిఁగి ‘ఓరీ కిన్నరాధమా! నీవిట్టి పనికిఁ బూనితివా?’ యని ‘సింహరూపముతో నరణ్యమునఁ బడియుండు’మని శపించెను. భీతిల్లిన నే నామునిపాదములపైఁబడి శాపము నుపహరింపు మని ప్రార్థింపఁగా ‘నావచన మమోఘము గాన నీకు సింహత్వ మైదువత్సరము లుండు’నని యనుగ్రహించెను. తత్ఫలితముగా నేను సింహమునై యీపొదరింటిలో నుంటిని. ఇప్పుడు నీఖడ్గధారకు గురియై సింహత్వము దొలఁగి నాపూర్వరూపంబును గంటి నని చెప్పఁగా సుచంద్రుఁ డతని నభినందించి యుపలాలించెను. అప్పుడు కుముదుఁడు, సుచంద్రునితో నో రాజా! చంద్రిక యఖండసౌందర్యవిలాసము, దేవతాత్వము విడిచి మానుషీత్వమును బొందిన యామె మంజులాంగకాంతి, మెఱుపుఁదీవను మించు నామె లావణ్యము, మొగ్గలను బోలిన యాకన్యపాదనఖములు, మార్దవారుణ్యములచేతఁ బల్లవకాంతి నోడించిన యా నెలఁత యడుగుల కాంతి, ఆజవరాలి మెఱుఁగుపిక్కలసోయగము, ఏనుఁగుతొండములను యరఁటికంబములను దిరస్కరించు నామెయూరువులు, అణుమధ్యయు, నతనాభియు, లకుచకుచయు, కంబుకంఠియు, చంద్రముఖియు నగు నాచంద్రిక, ఆవామేక్షణ, ఆ వక్రాలక, ఆలేమ సౌందర్యము నుతింపఁదరముగాదు. ఓనృపాల! ఆమిళిందకుంతల, ఆమీననేత్ర, ఆతామరసానన, ఆపికరవోజ్జ్వల, ఆయబ్జగళ, ఆబిసబాహ, ఆప్రవాళలలితపాద, ఆచెలి నీకే తగును. అని తనకథను జెప్పు సందర్భమున చంద్రిక జననక్రమ సౌందర్యవిలాస విశేషములను జెప్పెను. ఆవృత్తాంతము విన్న సుచంద్రుని కద్భుతాశ్చర్యములు గలిగి చిత్తమునఁ బూర్వజన్మసంస్కారముచేతనో మన్మథుని శాంబరీమహిమచేతనో చంద్రికపై ననురాగము రేకెత్తెను. ఆమెను జూచుటకు వాంఛ గల్గెను. కుముదునితోఁ దనకుఁ గలిగిన చంద్రికాదర్శనకుతూహలమును వెల్లడించెను. ఆవెంటనే కుముదుఁడు సతసించి తనవిమానమును స్మరింపఁగా నది వచ్చెను. వారిద్దఱు నావిమానము నెక్కి, యక్షుని మాయాప్రభావమున నెవ్వరికిని గనఁబడక, గిరినదీవనములు క్షణకాలమున దాటి క్షణదోదయరాజు పట్టణమును, తదుపరి చంద్రికావిలాసవనవాటినిఁ జేరిరి. కిన్నరశ్రేష్ఠుఁడగు కుముదుఁడదిగో! యటు చూడుము అనఁగా సుచంద్రమహారాజు బంగరుపీటపైఁ గూర్చుని తన