పుట:Chandrika-Parinayamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్తము లగు బంభరముల ఝంకారములచేతను ప్రతిధ్వనించుచున్న హేమకూటపర్వతమును గాంచెను. అట్లు చూచి, తమ విడిదిచేత నొక మహానగరభ్రాంతినిఁ గలిగించుచు, మార్గాయాసముచేత నలసియున్న సైన్యము నంతటిని ఆ హేమకూటపర్వతప్రాంతారణ్య మందు బసచేయుట కాజ్ఞాపించెను. అట్లు సైన్యమును డించి, బంగరువస్త్రముచేత కుట్టి సిద్ధపరుపఁబడిన పటకుటీరమునందు తాను వాసము చేసి, సంతోషముతో నుండెను. అట్లుండి, తన వయస్యునితో ఆగిరీంద్రతటమునందున్న కాంచనమాలతీలతావలయములనుండి వీచుచున్న మందమారుతము హాయిని గూర్చుచున్నది.ఈపర్వతరాజు తన సమగ్రవైభవమును జూడరమ్మని పవనాంకురములను బంపినట్లుగా నున్నది. అని పల్కి యా ప్రియసఖునిచేతిని కైదండగాఁబూని, చక్కని వజ్రసోపానము లెక్కుచు, పార్శ్వములందున్న మల్లికాలతలు, దాసీజనములవలె మారుతముచే ప్రేరితములై వీవనలు వీవగా నగేంద్రము నెక్కెను. అప్పు డారాజసఖుడు, ప్రభూ! ఈశైలరాజము నీవిచ్చటఁ జేరినమాత్రమున రత్నకటకములతో, స్వర్ణమౌళితో, ఆశ్రితరాజసింహమై, సంవృతానేకవాహినియై, చందనగంధవాసితమునై నీసారూప్యమును బొందినట్లుగా నున్నది. ఆ వజ్రమయ గండోపలము ఐరావతమును, దానిపైఁ బుష్పించిన పున్నాగవృక్షము దేవేంద్రునిఁ బోలియుండుటచేతఁ గాబోలు నీపర్వతము దేవతల కత్యంతప్రియమై యున్నది. నానావిధమణికూటములతో, మదపుటేనుఁగులతో, వాయువేగమున మ్రోగుచున్న గుహాచయముతో, వాజిసంచయముతో విరాజిల్లు నీహేమకూటము మేరుపర్వతముపైకి యుద్ధప్రయాణము చేయుచున్నట్లు గోచరించుచున్నది. జనవరేణ్య! ఇచ్చటి చెంచువనితల మృగయావినోదసౌందర్యము, వివిధమృగప్రతిబింబములతో విరాజిల్లు సెలయేటి నీటిసోయగము, గుహాసౌందర్యమును చూడదగియున్నవి. తుమ్మెదల ఝంకారములు నారీమణుల గానంబులుగాను, మెట్టదామరలపైనుండి వచ్చు పుప్పొడి పసుపువస్త్రముగాను, శిఖరాగ్రమందున్న తెల్లమబ్బు శ్వేతచ్ఛత్రముగాను, అరఁటియాకులు జయపతాకములుగాను, నాగకన్యలు వేశ్యారత్నములుగాను, శార్దూలము లుత్తమరాజశ్రేష్ఠులుగాను గొలుచుచుండఁగా పేరోలగం బున్న రాజరత్నమువలె నీ హేమకూటధరాధరము తేజరిల్లుచున్నదని వయస్యుఁడా పర్వతసౌందర్యమును వర్ణించి చెప్పెను. అట్లు వయస్యునిచే వర్ణింపఁబడుచున్న