పుట:Chandrika-Parinayamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంతసించి, రాజు నాశీర్వదించి, శాండిల్యుఁడు తన తపోవనమునకు వెళ్లెను.

సుచంద్రుఁడు భక్తిపురస్సరముగా శాండిల్యమునిని పంపి, కొలువుఁదీరి ఆప్తమంత్రిజనులతో సమాలోచనము చేసి, సైన్య సమూహములను రప్పించి, జయప్రయాణమును జేసెను. ఆసమయమున సైన్యము కావించిన ప్రయత్నము, మ్రోగించిన భేరీఢక్కాదులవలన బయలుదేరిన బంభారవము, బ్రహ్మాండము నిండి, సూర్యబింబము పడిపోవునో! మహావృక్షములు కూలి పోవునో! పర్వతము లెగిరిపోవునో! భూమండలము చలించిపోవునో! దిక్కులు పగిలిపోవునో! మేఘమండలము బ్రద్దలగునో! యను మహాభయమును గల్గించెను. అప్పు డతని కనుసంజ్ఞచేత నొకసారథి, తెల్లని గుఱ్ఱములు గట్టినదియు, వివిధపుష్పమాలాలంకృత మయినదియు, ఉత్తమపతాకలతో గూడినదియు, సకలాయుధసన్నద్ధమైనదియు, సువర్ణపుఱేకులతోఁ బొదుగఁబడినదియు నగు ఒక రత్నఖచితరథమును దెచ్చి నిలిపెను. సకలభూషణభూషితమైన తన చక్కని శరీరమునకు కుడిప్రక్కన దోపిన వజ్రపుపిడియు, బంగరునొఱయుఁ గల ఖడ్గము మిక్కిలి కాంతినిఁ జేకూర్పఁగా సుచంద్రుఁడు, శుభశకునములను జూచుచు, వివిధసామంతు లిదే సమయమని కొలువుమ్రొక్కులు చేయుచుండఁగా, వేత్రధారులు ‘అంగరాజా! పరాకు, కోసలనేతా! పరాకు, కేరళాధిపా! పరాకు’ అని మ్రొక్కుచున్న రాజులను హెచ్చరించు పరాకులు పల్కుచుండఁగా, బాలభానుఁడు పూర్వదిక్కున నుదయాద్రిపైన నధిరోహించినట్లు ఆ రత్నరథముపై నెక్కెను. సకలాయుధయుక్తమైన ఆ రథముపై సుచంద్రుఁడు బయలుదేర గా, రాక్షసయుద్ధమునందు ముందుఁజను నింద్రునివెనుక, తారకాసురసంహారత్వర గల కుమారస్వామివంటి శౌర్యధైర్యములు గల రాజకుమారులు, గుఱ్ఱములపై నెక్కి యతనిని వెంబడించిరి. ఆవెంట నలంకృతము లైన గజములతోను, రథములతోను, అశ్వములతోను, పదాతివర్గములతోను, సకలసైన్యములు బయలుదేరెను. అట్టి సైన్యముల మధ్య నున్న సుచంద్రుఁడు, సర్వనక్షత్రగణముతో నేలకు దిగిన చంద్రునివలె చూచువారికి నేత్రపర్వముఁ గలిగించెను. అట్లు జైత్రయాత్ర సాగించిన సుచంద్రుఁడు మహారణ్యపర్వతప్రాంతములు గడచి, కిన్నరీమణివీణానాదములచేతను, వివిధతరులతాపుష్పమకరందపాన