పుట:Chandrika-Parinayamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పర్వతసౌందర్యవైభవమును దిలకించుచు సుచంద్రుఁడు చంద్రకాంతమణిఖచితమై యిరుప్రక్కల లతాగృహములతో వెలయుచున్న గుహామార్గమున వెళ్లుచు, ఒకద్రాక్షామండపముక్రింద బంగరుటంది యల మ్రోత వినఁబడునట్లు కోలాటమాడుచున్న గంధర్వసతులుగల కోనను జూచెను. అచ్చటికి వెళ్ళి, కోనలోనికి పద్మరాగములతోఁ గట్టిన మెట్లదారినుండి యామిత్రసహితముగా దిగి, యొక మణిమంటమును గని, మిత్రమా! ఇచ్చట గొంచము తడవు నిలుతమా? యని యచ్చట నున్న యొక రత్నపీఠముపైఁ గూర్చుండెను.

అప్పుడొక మణిపుత్రిక యొయ్యారముగా వచ్చి కర్పూరతాంబూలము నిచ్చెను. ఒకసాలభంజిక బంగరుపువ్వుల చెంగావివస్త్రము గల వీవనతో వీచెను. ఒకబంగరుబొమ్మ కలాచిని బట్టుకొని నిలిచెను. ఒకచొకాటపుబొమ్మ పొన్నపూవులు గూర్చిన సురటితో విసరెను. ఇట్టులు ఊడిగములు గొనుచు మిత్రసహితుఁడై సుచంద్రుఁ డానందించుచుండఁగా నొకసింహము, మృగజాతమును బెదరించుచు విశాలమైన ముఖము, వంగినగోఱ్లు, శిరస్సుపైకిఁ జేర్పఁబడిన వాలము, ఎఱ్ఱని కేసరములు, వజ్రాయుధములవంటి కోఱలు, ఎఱ్ఱనికన్నులును గలిగి యా ప్రక్కనున్న యొక పొదరింటినుండి వెలుపటికి దూకెను. దూకి, సుచంద్రాదులను బట్టుకొనుట కుంకించుచుండఁగా సుచంద్రుఁడు తనచంద్రహాసముచేత దానితలను నఱికెను. అట్లు నఱుకఁబడిన దాని శరీరమునుండి వెలువడు రక్తమను సంధ్యారాగమునుండి సూర్యబింబమునుబోలిన కాంతితో నొక పురుషరూపము గోచరించెను. ఆ రూపమును జూచి యాశ్చర్యచకితుఁడై యున్న రాజువద్ద కాపురుషుఁడు ఒకకిన్నరుఁడై వచ్చి, వినయముతో “భానుకులాయ, శత్రుచర్యదమనపండితాయ, భవతే నమోఽస్తు” అని మ్రొక్కెను. అట్లు మ్రొక్కిన యాకిన్నరుని చేతితో నెత్తి చెంతఁ గూరుచుండఁబెట్టుకొని యతనికథ వినఁగోరి రాజిట్లనెను. ఓయీ! లోకోత్తరగుణశాలివి, కిన్నరశ్రేష్ఠుఁడవు నగు నీకు సింహత్వము గలుగుటయు, నది తొలఁగుటయు నెట్లు ఘటించెనో తెల్పుము. వినుటకు వేడుకపడుచున్నా ననఁగా నతఁడు పునఃపునరభివాదమును జేయుచు, తనకథ నిట్లు వివరించెను. ఒకప్పుడు బ్రహ్మదేవుఁడు సకలదేవబృందముతోఁ గొలువుఁదీరి యుండఁగా పారిజాతారణ్యమునందు తపస్సు గావించుచున్న వసంతుఁడను