పుట:Chandrika-Parinayamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇది నాయికయగు చంద్రికయొక్క సౌందర్యమును నాయకుఁడగు సుచంద్రుఁడు తనలోఁ దలఁచుకొని వలవంతఁ గ్రుంగు నప్పటి వర్ణనము. మనఃపద్యన్ అనఁగా మనోవీథియందు విచారింపఁగా నొకయువతి యవయములలోఁ గొన్ని యెఱ్ఱగను, కొన్ని నల్లగను, కొన్ని కోమలముగను, కొన్ని దృఢముగను ఉండుట యాశ్చర్యమని భావించెనట! ఇంతకును విశేషణముల చేత విశేష్యములను స్ఫురింపఁజేయు వ్యంగ్యరచనాపద్ధతిచేత నిబంధింపఁబడిన అతిశయోక్త్యలంకారమున కిది నిదర్శనము. పాదాది కేశాంతవర్ణనగా నున్న యిందులో అతిశోణంబు=మిక్కిలి యెఱ్ఱగా నున్నది పాదయుగ్మ మనియు, అతికోమలంబు=మిక్కిలి మృదువుగా నున్నది యూరువులజంట యనియు, అతివిశాలమైనది జఘననితంబప్రదేశమనియు, అతిశ్లక్ష్ణకంబు=మిక్కిలి కృశించినది నడుమనియు, అతినిమ్నమైనది నాభి యనియు, అతిమేచకంబు=మిక్కిలి నల్లనైనది నూగారనియు, అతి దృఢముగా నున్నది స్తనయుగ్మమనియు, అత్యంతపారిప్లవంబు=మిక్కిలి చపలమైనది కనుదోయి యనియు, అతివక్రంబు=ఎక్కువ వంకరలు దీరినవి ముంగురులనియు, అతిదీర్ఘము=మిక్కిలి దీర్ఘముగా నున్నది వేణి యనియుఁ దెలిసికొనవలెనని భావము. నాయకుఁడు విరహభ్రాంతిచే వనమునందలి ప్రకృతివిలాసములను జూచి నాయికకై యువ్విళ్ళూరుట యిట్లు వర్ణింపఁ బడినది.

సీ॥ కమ్మపుప్పొడిగాడ్పు గ్రమ్మ నొప్పగు బండి
గురివెంద విరిగుత్తి కొమరుఁ జూచి,
యలరు సంపెఁగతీవ యలమ నింపుగఁ దోఁచు
కలికిక్రొమ్మల్లియ చెలువుఁ జూచి,
మగతేఁటి వేడ్కమించఁగ ముద్దుగొనిన చ
క్కని మెట్టతామరకళుకుఁ జూచి,
సొలపు చక్కెరతిండిపులుఁగు మెక్కెడి బింబి
కాపక్వఫలము పొంకంబుఁ జూచి,