పుట:Chandrika-Parinayamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిజము చెప్పి నిందిర తనను జేరఁగా దీపితజీవన యయ్యెను. అనఁగా కమలమునందు లక్ష్మి నివసించుటయు, కమలముచేత జీవన మన నీరు ప్రకాశించుటయు మొదలగు కీర్తిని బొంది మేలుఁ గాంచెను. ఈపద్యమునందలి ‘విష్ణుపద, కరజాత, విగర్హిత, అశుచి, హరిపాద, దీపిత, జీవన’పదములు శ్లిష్టములు. నిజము పల్కువాఁడు మేలును బొందుననియును, అబద్ధమునకై ప్రమాణములు చేయువాఁడు పాపరోగములు గలవాఁడగు ననియు వస్తుధ్వని ప్రస్తుతముఖవర్ణనావస్తువుచేతఁ గలుగుచుండుటచే, నిది, వస్తుకృతవస్తుధ్వని. ఈ చంద్రకమలయుగప్రసక్తి యీ కవికిఁ గాళిదాసు కుమారసంభవము యీక్రింది శ్లోకభావమువలన గలుగఁగా దానిని కొంచెము మార్చి చెప్పినట్లు దోఁచును.

శ్లో॥ చంద్రంగతా పద్మగుణాన్ న భుంక్తే
పద్మాశ్రితా చాంద్రమసీ మభిఖ్యామ్|
ఉమాముఖంతు ప్రతిపద్య లోలా
ద్విసంశ్రయాం ప్రీతి మవాప లక్ష్మీః

చంచలయగు లక్ష్మి యనఁగా కాంత్యధిదేవత. చంద్రు నాశ్రయింపఁగా పద్మగుణములగు పరిమళాదులు లేకపోవుటయు, అట్లు కాదని పద్మము నాశ్రయింపఁగాఁ జంద్రగుణములగు చల్లదనము, తెల్లదనము లేకపోవుటయు గల్గి, పార్వతీముఖము నాశ్రయించెను. అప్పు డుభయగుణప్రాప్తిచేత ప్రీతినొందె నని భావము. అనఁగా పార్వతీముఖము చంద్రారవిందములకన్న నధికమని కాళిదాసు చెప్పఁగా, చంద్రికమొగము సైతము సుధానిధి కమలములకన్న నెక్కువ శోభగలది యని యీకవి చెప్పెను. ఇట్లెన్నియో పూర్వకవుల భావములు భంగ్యంతరమున మాధవరాయల కావ్యమున నచ్చటచ్చట గోచరించుచునే యుండును.

మ॥ అతిశోణం బతికోమలం బతివిశాలాత్మం బతిశ్లక్ష్ణకం
బతినిమ్నం బతిమేచకం బతిదృఢం బత్యంతపారిప్లవం
బతిచక్రం బతిదీర్ఘ మౌర! బళి! యీ యంభోజపత్రాక్షి య
ప్రతిమానావయవ ప్రతానము మనఃపద్యన్ విచారింపఁగన్.