పుట:Chandrika-Parinayamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నమాంబగారి యండదండలతో భారతస్వాతంత్ర్యలబ్ధియు, సంస్థానముల విలినీకరణము జరుగువరకును జటప్రోలు (కొల్లాపురం) సంస్థానమును బాలించిరి. పిమ్మట రాజ్యభారమునుండి విముక్తులై, విశ్రాంతినిఁ గొనుచుఁ బెక్కండ్రు విద్వాంసులకుఁ దమ తండ్రిగారగు రాజా వేంకటలక్ష్మారావు గారిచే నచ్చువేయింపఁబడిన చంద్రికాపరిణయప్రతులను ఉచితముగా నిచ్చిరి. పండితపోషణ, ధర్మకార్యనిర్వహణములందు శ్రద్ధాళువులై యున్న శ్రీ వేంకట జగన్నాథ బహద్దరువారు గత క్రీ.శ.1980వ సంవత్సరమున దివంగతులైరి. శ్రీవారికి వంశోద్ధారకుఁడైన కుమారుఁడు చిరంజీవి శ్రీ సురభి వేంకట కుమార కృష్ణబాలాదిత్యలక్ష్మారావు (శ్రీ బాలాదిత్య లక్ష్మారావు)ను, చిరంజీవి కుమారి శ్రీరత్నసుధాబాల యను పుత్రికయు వర్తమాన జటప్రోలు సురభివారి రాజవంశమున నున్నారు. ఈ చిరంజీవులను వారి కులదైవములగు మదనగోపాల, లక్ష్మీనృసింహస్వాములును, సురభివంశీయులగు పెద్దల సుకృతవిశేషములును బ్రోచి, రక్షించి యితోఽధిక విద్యాభోగభాగ్యసంపన్ను లగునట్లు వర్ధిల్లఁ జేయుదురుగాత.