పుట:Chandrika-Parinayamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1879 మార్చినెల 7వ తేదీకి సరియగు నీశ్వర సంవత్సర ఫాల్గుణ శుద్ధ తదియ గురువారము పగలు పదిగడియల సమయమున జరిగినది. క్రీ.శ.1865 సంవత్సరమున జన్మించిన శ్రీ వేంకటలక్ష్మారావుగారి వయస్సు ఆ యుత్సవమునాటికి 14 సంవత్సరము లై యుండెను. క్రీ.శ.1884 వ సంవత్సరం మార్చి 6వ తేదీన పట్టాభిషిక్తులై, క్రీ.శ.1896 మార్చి 3వ తేదీన నైజాం ప్రభువు ఫర్మానా ప్రకారము జటప్రోలు (కొల్లాపురం) రాజ్యముపై నధికారము గల ప్రభువులైరి. అప్పటినుండియు ప్రజాపాలన, ధర్మకార్యనిర్వహణ, సద్గ్రంథముద్రణాది సత్కార్యము లాచరించుచు దాదాపు ముప్పదిరెండు (32) సంవత్సరములు రాజ్యపాలనముఁ జేసి, తమపూర్వుఁడగు సురభిమాధవరాయవిరచితమగు ‘చంద్రికాపరిణయ’ప్రబంధమునకు బ్ర.వే.వెల్లాల సదాశివశాస్త్రి, బ్ర.వే. అవధానం శేషశాస్త్రిగార్లచేత ‘శరదాగమ’మను పేరుగల విపులమైన వ్యాఖ్యానమును రచింపఁజేసి, ముద్రణము చేయించి, పండితాశీ ర్వాదమును బొంది, పితౄణమును దీర్చికొని క్రీ.శ.1928 ఏప్రిల్‌నెల 15వ తేదీన దివంగతులైరి. చక్కఁగా ముద్రింపఁబడిన యా కావ్యప్రతులను జూచి వారి యాత్మ యెంత సంతోషపడియుండెనో చెప్పఁజాలము.

శ్రీ రాజా వేంకటలక్ష్మారావు బహద్దరువారు సప్తసంతానములలో ముఖ్యతమమైన పుత్రరత్నము లేక యిద్దఱు పుత్రికారత్నములుమాత్ర ముండుటచేత తమ వంశోద్ధరణమునకై తమ యన్నగారగు బొబ్బిలి సంస్థానాధీశులు శ్రీ రాజా శ్వేతాచలపతి వేంకట రంగారావు బహద్దర్ వారి పౌత్రులు శ్రీ రాజా రాజగోపాలరావుగారిని దత్తునిగా స్వీకరించి యా బాలునకిఁ దమ జనకుని నామధేయమగు శ్రీ రాజా వేంకట జగన్నాథరావు బహద్దర్ అని నామకరణముఁ జేసిరి. కాని దత్తపుత్రునికి పట్టాభిషేకమును, పరిణయమును గావింపక మునుపే శ్రీ వేంకట లక్ష్మారావుగారు దివంగతు లగుటచేత నాశుభకార్యములు వారి ధర్మపత్ని శ్రీ రాణీ వేంకటరత్నమాంబగారి కరకమలములద్వారా జరిగినవి. వారి రెండవకుమార్తె శ్రీమతి రాణీ సరస్వతీదేవిగారి పుత్రిక యగు శ్రీమతి రాణీ ఇందిరాదేవిగారిని శ్రీ వేంకట జగన్నాథరావు బహద్దరుగారి కిచ్చి వివాహమును జరిపించిరి. శ్రీ రాజా వేంకట జగన్నాథరావు బహద్దరువారు జటప్రోలు రాజ్యపట్టభద్రులై మాతృశ్రీ రాణీ వేంకట