పుట:Chandrika-Parinayamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవితావైదుష్యము

‘చంద్రిక’యను నాయికయొక్క పరిణయమును కథావస్తువుగాఁ జెప్పుటచేత నీకావ్యమునకుఁ ‘జంద్రికాపరిణయము’ అను నామధేయము అన్వర్థమై యొప్పుచున్నది. శృంగారరసప్రధానమైన యీకావ్య మాఱాశ్వాసములతో నమర్పఁబడి యున్నది. కావ్యమందంతటను శ్లేషచమత్కారము, పదప్రయోగచాతుర్యముఁ గల పద్యము లుండుటయేగాక చతుర్థాశ్వా సము మొత్తము యమకాలంకారములతో నిండి యొప్పారుచున్నది. న్యాయ వైశేషిక వేదాంత వ్యాకరణాది తంత్రప్రసిద్ధ కల్పనా నల్పంబై మాధవరాయల యశేషవిశేషవైదుషీప్రతిభను అడుగడుగునను జాటుచునే యుండును. ఈకావ్యమును శ్రీమహావిష్ణువునకుఁ బ్రతికృతియైన శ్రీజటప్రోలు మదనగోపాలమూర్తి, ‘శ్రీవాసజ్జటప్రోలీ, భావుకపత్తన విహార పటుశీలునకున్, గోవర్ధన గోవర్ధన గోవర్ధన వృష్టిహృతికి గోపాలునకున్’ అని కవి యంకితము చేసినాడు. ఈమదనగోపాలస్వామి జటప్రోలు (కొల్లాపురము) రాజుల కాదికాలమునుండి నేటివరకును గులదైవమై యిష్టదైవమై సకలసౌభాగ్యములను జేకూర్చుచున్నాడు. శ్రీశైలము జలవిద్యుత్తుజలాశయమునం దీజటప్రోలు నగరము మునిగిపోవనుండఁగా, శ్రీస్వామివారి దేవాలయసహితముగా నా గ్రామమును దరలించి మరియొకచోట నిర్మించు నేర్పాటును ఇటీవలనే స్వర్గస్థులైన శ్రీశ్రీ రాజా సురభి వేంకట జగన్నాథరావు బహద్దరువారు చేసి, వంశప్రతిష్ఠను నిలిపినారు. ఆనగర మిప్పు డింకను నిర్మాణములో నున్నది.

ఈ చంద్రికాపరిణయకావ్యమునకుఁ గథానాయకుఁడు సుచంద్రుఁడు. సూర్యవంశీయుఁడై విశాలానగరమునకుఁ బరిపాలకుఁడై యుండిన యీ