పుట:Chandrika-Parinayamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇజారతి దేఖీలు యెప్పటివలె మీతండ్రి మాధవరాయని కార్‌కిర్దున నడిచినట్టు మీకు శాశ్వతముగా నిరాచ్ఛేదముగా మొకరరు చేయ నవధరించినారము కాన ఖాతరుజమాతోటి కమావిసు చేసుకునేది’ ఇత్యాదిగా ఫర్మాను ఇయ్యఁబడినది.

ఆతరువాతి తరములవారందఱికిని గోలకొండ నిజాంప్రభువుల సన్నదులు లభిస్తూ వచ్చినవి. వారు, వరుసగా నరసింగరావు, మాధవరావు, బారిగడపులరావు, పెద్దరామారాయఁడు, జగన్నాథరావు అను నామధేయములు గలవారై యుండిరి. ఇరువదినాలుగవతరమువాఁడగు నీజగన్నాథరావునకు సంతానము లేకపోఁగా ఓరుగల్లుమండలాంతర్గత పాకాలతాలూకా లోని గురిజాలగ్రామమందుండిన ‘రావు’ వంశపువారి పిల్లవానిని దత్తు తెచ్చుకొని యతనికి ‘వేంకటలక్ష్మారావు’ అని నామకరణముఁ జేసిరి (సురభివారు పూర్వకాలమున రావువంశపువారే యైయున్నందున ఆదత్తు సగోత్రదత్తతగా భావింపఁబడి యుండును). ఈ వేంకటలక్ష్మారావుగారు ఒక గొప్పవజ్రమును హైదరాబాదు నవాబుకు నజ్రానాగా నిచ్చి జటప్రోలు సంస్థానమును పేష్కష్ ఏర్పాటుతో శాశ్వతకౌలుగా (బిల్‌మఖ్తాగా) సంపాదించెను. ఈప్రభువునకుఁగూడా సంతానము లేనందున తన జన్మస్థానమునుండి యొక బాలుని దత్తు తెచ్చుకొని యతనికి వేంకటజగన్నాథరావు అని నామకరణముఁ జేసెను. ఈ వేంకటజగన్నాథరావుగారు గుఱ్ఱపుఁబందెములలో మిక్కిలి నైపుణ్యము గలవారై బెంగుళూరు, మద్రాసు నగరములలో జరుగుచుండిన పందెములలో పలుసార్లు విజయమును బొందియుండిరి. కాంచీనగర వరదరాజస్వామివారికి దైనందినము బిందెసేవ కైంకర్యమున కేర్పాటు చేసిరి. సింగపట్టణం దేవాలయము నభివృద్ధిపరచి ‘లక్ష్మీనృసింహవిలాస’ మను సంస్కృతచంపూగ్రంథమును, ‘జటప్రోలు మదనగోపాలమాహాత్మ్య’మను సంస్కృతకావ్యమును హొసుదుర్గం కృష్ణమాచార్యులవారిచేత రచింపఁ జేసిరి. ఈ వేంకటజగన్నాథరావుగారికి సంతతి లేనందున వేంకటగిరి ప్రభువులైన శ్రీసర్వజ్ఞ కుమారయాచమనాయుడుగారి చతుర్థపుత్రులయిన నవనీత కృష్ణయాచేంద్రులను దత్తపుత్రునిగా స్వీకరించిరి. ఈ దత్తపుత్రునికి తమతండ్రి పేరున శ్రీవేంకటలక్ష్మారావు గారని నామకరణము చేసిరి. ఈ దత్తస్వీకారమహోత్సవము శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామివారి సన్నిధియందు క్రీ.శ.