పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన జీవితంలో నిజాయితీ కూడ వుండాలి మనం వాడే తూకపురాళ్ళూ కొలమానాలూ సక్రమంగా వుండాలి.

నీవు నమ్మినదానికి కట్టుబడి వుండు
నీ పలుకుల్లో నిజాయితీ చూపెట్టు.
గొప్పవాడిలా తిరుగుతూ ఆకలితో చావడంకంటె
సామాన్యునిలా బ్రతుకుతూ
కడుపుకూడు సంపాదించుకోవడం మేలు.
సరియైన కొలమానాలూ పడికట్టురాళ్ళూ వాడాలి
పెద్దదో చిన్నదో వ్యాపారం చేసికోవాలి.
తూనికలు కొలతలు సక్రమంగా వుండాలని ప్రభువు కోరిక
సక్రమంగా సరుకులు అమ్మాలని అతని ఆశయం. - సీరా 5,10. సామె
 12,9. సీరా 42,5. సామె 16,11

నరుల్లో నమ్మదగినతనం వుండాలి. స్నేహితుని రహస్యాలను వెల్లడి చేయకూడదు. సకాలంలో ఋణం తీర్చాలి. నమ్మదగినవాళ్ళంగా నటిస్తేనే చాలదు.

నీ స్నేహితుణ్ణి ప్రేమించి విశ్వసనీయుడివిగా మెలగు
అతని రహస్యాలను వెల్లడిచేస్తే
ఇక అతన్ని వదలుకోవలసిందే
నరుడు తన శత్రువుని నాశం చేసినట్లే
నీవుకూడ రహస్య ప్రకాశనంద్వారా
నీ స్నేహాన్ని నాశం చేసికొన్నావు
నీ చేతిలోని పక్షి జారిపోయినట్లే
నీ స్నేహితుడుకూడ తప్పించుకొన్నాడు
అతడు మరల నీకు చిక్కడు.
నీవు ఋణదాతకిచ్చిన మాట నిలుపుకొంటే
అతడు నీ యక్కరల్లో ఎల్లప్పడూ సాయం చేస్తాడు
నీకు పూటకాపుగా వున్నవాని వుపకారాన్ని మరువకు
అతడు తన పరువుని పణంగాబెట్టి నిన్ను కాపాడాడు.
నీవు కరుణనూ విశ్వనీయతనూ అలవర్చుకో
వానిని దండలాగ నీ మెడలో తాలు
నీ హృదయఫలకంపై వ్రాసికో.
అందరూ మేము నమ్మదగినవాళ్ళమేనని చెప్పకొంటారు
కాని యధార్థంగా విశ్వసనీయులైనవాళ్లు ఎందరు? - సీరా 27,17-18. 29,3-
15. సామె 3,3.20,6