పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాని సాయంతో నీకు ప్రీతి కలిగించేదేదో
 నేను తెలిసికొందునుగాక - సొలో జ్ఞాన 9, 1–10

సీరాగూడ దీనికొరకు దేవునికి ప్రార్థన చేసాడు
 నేను విజ్ఞానం కొరకు పోరాడాను
విశుద్ధ వర్తనాన్ని అలవర్చుకొన్నాను
 దేవునికి ప్రార్ధనచేసి
 నేనెంతటి అజ్ఞానినో తెలియజేసికొన్నాను
 కాని నేను విజ్ఞానాన్ని అభిలషించాను
 నిర్మల హృదయాన్ని అలవర్చుకొని దాన్ని సాధించాను
దానిని ఆర్జించినప్పటినుండి వివేకవంతుజ్ఞయ్యాను
 ఇక నేను దానిని విడనాడను - సీరా 51,19-20

ఈ భక్తుల్లాగే మనంగూడ జ్ఞానంకొరకు ప్రార్థిద్దాం. దేవునినుండి ఈ యమూల్యవరాన్ని పొందుదాం.

7. కొన్ని నైతిక విలువలు

జ్ఞాన గ్రంథాలు చాలా నైతిక విలువలను పేర్కొంటాయి. ప్రస్తుతానికి వాటిలో మూడింటిని పరిశీలిద్దాం. అవి పొదుపు, నిజాయితీ, నమ్మదగినతనం. మానవుడు పొదుపుగా జీవించాలి.

పంటలు పండిన కాలాన కరువును గుర్తుంచుకో
సంపదలు కలిగిన కాలాన పేదరికాన్ని స్మరించుకో
ఉదయ సాయంకాల మధ్యలోనే పరిస్థితులు మారవచ్చు
ప్రభువు తలపెట్టిన మార్పు అతి శీఘ్రంగా వస్తుంది - సీరా 18,25-26

కనుక నరుడు దూబర ఖర్చులు మానాలి
 సుఖభోగాలకు దాసుడివి కావద్దు
 భోగజీవనంవలన అయ్యేఖర్చులు నిన్ను గుల్లజేస్తాయి
 నీ చేత డబ్బులేనపుడు
బాకీలుజేసి విందులారగించి బిచ్చగాడివైపోవద్దు
అలా చేస్తే నీవు సంపన్నుడివి కాలేవు
 చిన్న విషయాల్లో శ్రద్ధ చూపనివాడు
 క్రమంగా నశిస్తాడు - 18,32-19,1