పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకల్పించుకొన్నాడు. డమస్కు ప్రార్ధనా మందిరాల అధిపతులకు చూపడానికి ప్రధానార్చకుని నుండి పరిచయ పత్రాలను పొందాడు.

యెరూషలేమునుండి డమస్కు నగరానికి 140 మైళ్ళ దూరం. ఈ పట్టణం ప్రపంచంలోని అతి ప్రాచీన నగరాల్లో వొకటి. గొప్ప కూడలి తావు. సౌలు ఇద్దరు ముగ్గురు అనుచరులను తీసికొని గుర్రాలమీద ఈ నగరానికి వెళ్తున్నాడు. అది క్రీస్తుశకం 36వ సంవత్సరం, దారిలో తలవని తలంపుగా అతనికి ప్రభు దర్శనం కలిగింది.

కాని సౌలు క్రైస్తవులను ఎందుకు హింసించాడు? అతడు దుషుడు కాదు. భక్తిపరుడైన రబ్బయి. క్రైస్తవ మార్గాన్ని అపార్థం చేసుకోవడంవల్ల అతడు క్రైస్తవులకు శత్రువయ్యాడు.

క్రైస్తవులు క్రీస్తే మెస్సీయా అంటున్నారు. కాని ధర్మశాస్త్రం ప్రకారం సిలువ వేయబడినవాడు శాపగ్రస్తుడు - ద్వితీ 21,22-23. ఈలాంటి శాపగ్రస్తుడు మెస్సీయా ఏలాగౌతాడని సౌలు వాదం. ఇంకా, మెస్సీయా రాజుగా వస్తాడనుకొన్నారు యూదులు. అలాంటప్పుడు, సిలువమీద దిక్కులేని చావు చచ్చిన క్రీస్తు మెస్సీయా ఏలాగౌతాడు? పైపెచ్చు క్రైస్తవులు క్రీస్తుని "ప్రభువు" అంటున్నారు. ఇది పూర్వవేదంలో యావేకు వర్తించే బిరుదం. దీన్ని క్రీస్తుకు వాడితే అతడు యావే ప్రభువుతో సరిసమానమౌతాడు. అపుడు ఇద్దరు దేవుళ్ళవుతారు. కాని యూదులు ఏకేశ్వరోపాసకులు. కనుక క్రీస్తుని "ప్రభువు" అనడం సౌలు దృష్టిలో దేవదూషణం, ఇంకో అపరాధమేమిటంటే, క్రైస్తవులు యెరూషలేం దేవాలయాన్నీ ధర్మశాస్తాన్నీ తూలనాడుతున్నారు - అ, చ.6, 14 ప్రాచీన కాలంనుండీ యూదులకు ఈ రెండూ పరమ పవిత్రమైనవి. పరిసయుల శాఖకు చెందిన పరమ నిష్ణాపరుడైన సౌలుకి ఈ నింద సహింపరానిదైంది. ఇన్ని కారణాలవల్ల అతడు క్రైస్తవులను హింసించడానికి పూనుకొన్నాడు.

సౌలు డమస్కనగరాన్ని సమీపిస్తుండగా ఉత్తాన క్రీస్తు అతనికి వెలుగురూపంలో దర్శనమిచ్చాడు. ఆ వెలుగును భరించలేక సౌలు గుర్రం మీదినుండి క్రిందపడ్డాడు. పూర్వవేదంలో యావే ప్రభువు వెలుగు. అతడే వెలుగుని చేసాడు. ఆ వెలురు ఇప్పడు ఉత్తాన క్రీస్తు రూపంలో సౌలుమీద ప్రసరించింది - 2కొ 4,6. ఆ వెల్లురు సౌలూ నీవు నన్నెందుకు హింసిస్తున్నావని ప్రశ్నించింది. ప్రభూ! నీవెవరివి అని సౌలు అడిగాడు. నీవు హింసించే క్రీస్తుని నేనేనని ఆ జ్యోతి సమాధానం చెప్పింది. సౌలు క్రీస్తుని బాధించలేదు. క్రైస్తవులను బాధించాడు. కాని క్రీస్తు క్రైస్తవుల్లో నెలకొని వుంటాడు. క్రైస్తవులు, తిరుసభ, అతనికి శరీరం. అనగా వాళ్ళు క్రీస్తుతోకూడి ఏకవ్యక్తి ఔతారు. అలాంటి క్రైస్తవుల్ని హింసిస్తే క్రీస్తుని హింసించినట్లే, క్రీస్తు క్రైస్తవుల్లో ప్రత్యక్షమై వుంటాడు.