పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


15. ఏలీయాకు వారసుడుగా ఎలీషా


2రాజు 2


1. సందర్భం

ఏలీయా స్వర్గానికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఎలీషా అతనికి వారసుడయ్యాడు. అద్భుతాలు చేసే గురువుగారి శక్తి అతనికి సంక్రమించింది.


2. వివరణం

ఏలీయా ఎలీషా గిల్లాలునుండి బేతేలుకి అక్కడి నుండి యెరికోకీ, అక్కడినుండి యోర్గానుకీ వెళ్ళారు. ప్రతి తావులోను ఏలీయా శిష్యునితో ఇక నీవిక్కడ ఆగు అని చెప్తుండేవాడు. శిష్యుని విశ్వాసాన్ని పరీక్షించాలని ఏలీయా తలంపు. అతడు ఈలా చెప్పినపుడల్లా యెలీషా దేవుని తోడు. నేను నిన్ను వదలిపెట్టను అనేవాడు. చివరి గడియల్లో గురువుగారిని వదలిపెట్టకుండా భక్తితో సేవించాలని ఎలీషా తలంపు.

ప్రవక్తలు యేలీయా మోక్షానికి వెళ్ళిపోబోతున్నాడని గుసగుసలాడుకో జొచ్చారు. వాళ్ళ పై తావులన్నిటిలోను ఆ సంగతిని గూర్చి ఎలీషాను అడిగారు. ఆ విషయాన్ని గూర్చి మనం అసలు మాట్లాడకూడదు. మీరు నోరు కదపవద్దని యెలీషా వారిని మందలించాడు.
యోర్దాను నది దగ్గరికి రాగానే యేలీయా తన అంగీని తీసి నదీ జలాలను మోదాడు. వెంటనే నది రెండు పాయలుగా చీలి దారి యేర్పడింది. గురుశిష్యులు నది ఆవలి వొడ్డుకు వెళ్ళిపోయారు. అక్కడినుండే యేలీయా స్వర్గానికి వెళ్లాడు. పూర్వం మోషే సముద్రజలంగుండా దారిచేసాడు–నిర్గ 14. యోషువా ఈ నదీ జలాలగుండానే త్రోవచేసాడు–3. అలాగే యిప్పడు ఏలీయా కూడ ఆ నీటిగుండా మార్గం చేసాడు.
ఏలీయా శిష్యుని భక్తికి సంతసించి, నేను వెళ్ళిపోబోతున్నాను. ఈ చివరి క్షణాల్లో నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. శిష్యుడు అయ్యా! నాకు నీ శక్తిలో రెండువంతులు దయచేయి అని అడిగాడు. యూదుల సంప్రదాయం ప్రకారం పెద్దకొడుక్కి తండ్రి ఆస్తిలో రెండువంతులు వస్తుంది—ద్వితీ 21,17. కనుక గురువు తన్ను పెద్దకొడుకుని చూచినట్లుగా చూడాలని ఎలీషా ఉద్దేశం. అనగా గురువునుండి ప్రవక్త శక్తిని సమృద్ధిగాపొంది అతినికి తగిన వారసుడు కావాలని ఎలీషా కోరిక.
కాని ప్రవక్త పదవీ వారసంగా వచ్చేదికాదు. అది దేవుడిచ్చే వరం. కనుక ఏలీయా శిష్యునితో నాయనా! నీ కోర్మెను తీర్చడం కష్టం. నేను ఈ భూమి మీదినుండి వెళ్ళిపోయేపుడు నేను నీకు కన్పిస్తే నీకోరిక నెరవేరుతుంది. కన్పించకపోతే నెరవేరదు