పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏలీయా తన్నుతిట్టి శపించగా అహాబు పశ్చాత్తాపపడ్డాడు. సంతాపసూచకంగా గోనెతాల్చి ఉపవాసమున్నాడు. కటిక నేలపై పండుకొన్నాడు. ప్రభువు అతన్ని పశ్చాత్తాపాన్ని చూచి మనసు మార్చుకొన్నాడు. యావే అహాబు కాలంలోనే అతని వంశాన్ని నాశం చేయలేదు. ఆ శిక్షను అహాబు కుమారుని కాలానికి వాయిదా వేసాడు.


3. ప్రార్ధనా భావాలు

1. ఈ య్యధ్యాయంలో ముఖ్యమైన అంశం సాంఘిక అన్యాయం. రాజా న్యాయాధిపతీ ఐన అహాబు న్యాయాన్ని చెరిచాడు. అధికారగర్వంతో పేదవాడైన నాబోతును చంపించి అతని పొలాన్ని దోచుకొన్నాడు. దానికి తగిన శిక్షను అనుభవించాడు. ఈనాడుకూడ ధనవంతులు పేదలకు అన్యాయం చేస్తూనే వున్నారు. ఆ పేదల నెత్తురు పూర్వం హేబెలు నెత్తురులాగ దేవునికి మొరపెట్టితీరుతుంది - ఆది 4,10. కనుక మన క్రిందివాళ్ళకు మనమెప్పడూ అన్యాయం చేయకూడదు. ఒకరికి ముట్టవలసింది మనం కొట్టివేయకూడదు. ఎవరికి దక్కవలసింది వాళ్ళకు దక్కనీయాలి.

2. అహాబులాగ దుండగాలు చేసేవాళ్ళు నేడూ వున్నారు. కాని ఆ దుండగాలను ఖండించే ప్రవక్తలు మాత్రం నేడు లేరు. ఐనా ప్రవక్తల స్థానంలో మన అంతరాత్మ వుంది. మనం పాపకార్యం చేసిన వెంటనే మన అంతరాత్మ మనలను హెచ్చరిస్తుంది. చీవాట్లు పెడుతుంది. అంతరాత్మ ప్రబోధం విని మన తప్పులకు మనం పశ్చాత్తాపపడాలి.

3. ఏలీయా అహాబు రాజుకి భయపడలేదు. ధైర్యంగా అతన్ని ఎదిరించాడు. అతని తప్పిదాన్ని వేలెత్తి చూపించాడు. నేటి సమాజంలో ధనవంతులూ బలవంతులూ చేసే అన్యాయాలు మనకు తెలుసు. కాని వాళ్ళను ఎదిరించే సాహసం మనకుండదు. పలుకుబడి కలవాళ్ళను ఎదిరించి మనం విజయాన్ని సాధించలేం. పైగా ప్రమాదాన్ని కొనితెచ్చుకొంటాంగూడ. అందుచేత దడుస్తాం, వెనుకాడతాం. కాని ప్రవక్తలు ఈలా దడవలేదు. నిర్భయంగా దుష్టలను ఎదుర్కొన్నారు. వాళ్ళ ధైర్యం మనకుకూడ లభించాలని ప్రభువుని వేడుకొందాం.

4. అహాబు ' ఏలీయా నోటినుం: వచ్చిన ప్రభువు వాక్యాలకి దడిసాడు. పశ్చాత్తాపపడ్డాడు. అలాగే మనం కూడ పాపకార్యాలు చేసినపుడు ప్రభువు ఆజ్ఞలకు భయపడాలి. చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడాలి.