పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని చెప్పాడు. ఏలీయా స్వర్గానికి వెళ్ళేపుడు ఇతర ప్రవక్తలెవరూ చూడలేదు గాని ఎలీషా మాత్రం చూచాడు.

గురుశిష్యులు ఈలా మాటలాడుకొంటూండగానే అగ్ని రథం వారిరువురిమధ్య ప్రవేశించింది. ఏలీయాకీ నిప్పుకీ దగ్గరి సంబంధం వుంది. అతడు నిప్పుని రప్పించే ప్రవక్త. ఇక్కడ నిప్పురథం దైవసాన్నిధ్యానికి గుర్తు. ఈ రథంతోపాటు వచ్చిన సుడిగాలి యేలీయాను మోక్షానికి కొనిపోయింది. పూర్వం హనోకుని కూడ దేవుడు ఈలాగే అద్భుతంగా స్వర్గానికి తీసికొని పోయాడని చదువుతున్నాం - ఆది 5,24.

సుడిగాలి ఏలీయాను స్వర్గానికి కొనిపోయిందనే వాక్యం అతడు చనిపోలేదని చెప్పదు. ఏలీయా మరణం మీద దేవునికి సర్వాధికారం వుందని మాత్రమే ఈ వాక్యభావం. అనగా దేవుడు తన కిష్టమొచ్చిన రీతిలో ఏలీయాకు మరణాన్ని పంపాడు. ఏలీయా ఏలా మరణించాడో మనకు తెలియదు. మరణానంతరమే దేవుడు అతని ఆత్మను తీసికొనిపోయాడు. బాబిలోనియా ప్రజలు తమ గాథల్లో వారివీరులూ రాజులూ సజీవులుగానే స్వర్గానికి వెళ్ళిపోయారని చెప్పకొనేవాళ్ళు. ఇక్కడ బైబులు రచయిత ఏలీయాను గూర్చికూడ ఇదే పద్ధతిలో చెప్పాడు. ఆ ప్రవక్తకు అసాధారణమైన గొప్పతనం ఆపాదించాలని అతని కోరిక.

ఏలీయా యూవే మతానికి నాయకుడు. అతడు లేకపోతే దేశంలో యామే మతం ఏలా నిలుస్తుంది? పైగా బాలు మతం పెచ్చుపెరిగిపోదా? కనుక ఎలీషా సంతాపంతో తండ్రీ! యిప్రాయేలును అన్నివిధాల కాచి కాపాడుతూ వచ్చిన నీవుపోతే ఇక మాకు దిక్కేముంది అని అరచాడు. అతడు గురువుగారివైపు అలాగే చూస్తూ నిల్చుండిపోయాడు. కొంతసేపయ్యాక గురువు అతనికి కన్పించలేదు.

ఎలీషా జారిపడిపోయిన గురువుగారి అంగీని తీసికొని యోర్ధానునది వొడ్డను నిల్చున్నాడు. ఇక్కడ ఈ యంగీ దాన్ని ధరించిన ఏలీయా శక్తి తెలియజేస్తుంది. ఆ శక్తి ఎలీషాలోకి ప్రవేశించింది. కనుక అతడు ఆ యంగీతో నదీజలాలను బాదగానే అవి రెండు పాయలుగా చీలిపోయి దారి ఏర్పడింది. ఎలీషా ఆ దారిగుండా ఈవలి గట్టుకి వచ్చాడు. కావున అద్భుతాలుచేసే గురువుగారి శక్తి ఎలీషాకు సమృద్ధిగా లభించిందని అర్థంజేసికోవాలి.

గురుశిష్యులతోపాటు యెరికోనుండి 50మంది ప్రవక్తలుకూడ యోర్ధాను సమీపానికి వచ్చి దూరంగా నిలబడ్డారు. ఏలీయా మోక్షారోపణాన్నియెలీషాలాగ వాళ్ళు చూడలేదు. అద్భుతాలుచేసే అతనిశక్తికూడ వాళ్ళకు సంక్రమించలేదు. ఇప్పడు ఎలీషాకు నది దారి ఈయడం జూచి వాళ్ళంతా ఏలీయా శక్తి ఎలీషాకు సంక్రమించిందని తెలిసికొన్నారు. వినయంతో అతనికి నమస్కరించి అతన్నితమ నాయకునిగా ఎన్నుకొన్నారు.