పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియు మహిమను కొనియాడ్డం ఎవరితరం?" అని వ్రాసాడు. మరియు దేవమాత మానవులమాత. ప్రస్తుతం ఆ పునీతమాతనుగూర్చి నాల్గంశాలను విచారిద్దాం.

1. దేవమాత

మరియమాత ఎలా దేవమాత ఔతుంది? క్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి. అతడు నరుడూ, దేవుడునూ. ఐనా ఈ క్రీస్తు ఇద్దరు వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తి అతడు దేవుడూ మానవుడూ ఐన క్రీస్తు. దైవవార్త మానుషదేహాన్ని స్వీకరింపగా క్రీస్తు ఆవిర్భవించాడు. ఈలా మానవుడు దేవుడూ ఐన ఏకైక వ్యక్తిని మరియ కన్నది. ఆమెకు పట్టిన కుమారుడు క్రీస్తు మొదట దేవుడై అటుతరువాత మానవుడు కాలేదు. లేదా మొదట మానవుడై తర్వాత దేవుడు కాలేదు. అతడు మొదటి నుండి దేవుడూ మానవుడూను. అతడు దేవుడూ మానవుడూ కనుక అతన్ని కన్నతల్లికూడ దేవునికీ మానవునికీ తల్లి ఔతుంది. అందుచేత ఆమెను "దేవమాత" అని పిలుస్తుంటాం.

ఈలా దేవమాత కావడం కోసమే మరియు పాపం లేకుండా నిష్కళంకగా ఉద్భవించింది. ఇందుకోసమే ఆమె కన్యగా వుండిపోయి ప్రభువుకి తన నిండు హృదయాన్ని సమర్పించుకుంది. ఇందుకొరకే ఆమె సకల వరప్రసాదాలూ పొంది సుందరమైన వధువుగా తయారైంది.

మరియు దేవమాత కావడమంటే యేమిటి? ఆమె మూలంగా దేవుడు మన మానవ కుటుంబంలోకి దిగి వచ్చాడు. మన మంటిమీద అడుగుపెట్టాడు. ఆమె వలన క్రీస్తునందు మన రక్తమాంసాలు ఏర్పడ్డాయి. అతడు మనకు పెద్దన్నకాగలిగాడు. మనము అతని తమ్ముళ్ళమూ, చెల్లెళ్ళమూ అయ్యాం. దేవుణ్ణి నరునివద్దకు కొనివచ్చి నరుని దేవుని వద్దకు కొనిపోయే ధన్యురాలు మరియ.

2. విశ్వాసుల మాత

మరియు దేవమాత మాత్రమేకాదు. విశ్వాసులమాత కూడ. ఎలాగ? ఆమె క్రీస్తమాత అన్నాం. క్రీస్తులోకి జ్ఞానస్నానం పొందేవాళ్ళంతా అతనితో ఐక్యమౌతారు. అతడు వాళ్ళకు శిరస్సు వాళ్ళు అతని దేహం - రోమ 12,5. అతడు తల్లితీగ, వాళ్ళు అతనిలోకి అతుక్కపోయిన రెమ్మలు - యోహా 15, 5. అతడు పునాదిరాయి. వాళ్ళ అతనిమీద భవనంగా నిర్మింపబడే సజీవశిలలు -1 పేత్రు 2,5. ఈ క్రీస్తు పూర్తి క్రీస్తు జ్ఞానక్రీస్తు. అనగా రక్షకుడూ, రక్షణం పొందవలసిన వాళ్ళూను. ఇక క్రీస్తును కన్న మరియమాత ఈ పూర్తి క్రీస్తునుకూడ కంది. అనగా క్రీస్తు మాత, క్రీస్తుతో ఐక్యమైన