పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. కన్యమాతపట్ల భక్తిభావాలు

కన్యాజీవితం జీవించడంలో, పరిశుద్ధ జీవితం గడపడంలో కన్యమరియ మనకు ఆదర్శంగా వుంటుంది. ఈ పరిశుద్ధ జీవితానికి విరుద్ధంగావచ్చే శోధనలను జయించడానికి ఆ తల్లి సహాయపడుతుంది. కన్యమరియ వినయమూ మర్యాదా ఆమె కన్యాత్వాన్ని కాపాడాయి. ఆనాడు ఆమెను చూచినపుడు ఎవరికీ కామభావాలు కలుగలేదు. ఆమె ఆకారమూ, ప్రవర్తనమూ ఇతరులలోకూడ పరిశుద్ధభావాలు కలిగించేలా వుండేవి. మనంకూడ ఈలాగే విశుద్ధ జీవితం జీవించేలా సాయపడమని ఆ తల్లిని అడుగుకుందాం.

మన ఈ దేహం జ్ఞానస్నానం ద్వారా ప్రభువుకే నివేదితమైంది. కనుక మనం అశుభ్రవర్తనంతో ఈ దేహాన్ని అమంగళ పరచకూడదు. క్రైస్తవుడు ఈ దేహంతోను పాపం చేయకూడదు, ఈ దేహంలోను పాపం చేయకూడదు - 1కొ 6,18. ఆ పునీతకన్య తన దేహాన్ని శుచిమంతంగా కాపాడుకుంది. మనమూ మన దేహాలను శుచిమంతంగా వుంచుకునేలా సాయపడమని ఆ తల్లిని వేడుకుందాం.

మరియ దేవునికి నివేదిత. అలాగే మనమూ మన బిడ్డలను దైవసేవకు అర్పిస్తుండాలి. పూవును కోసి ముచ్చటగా జడలో ముడుచుకోవడం మంచిదే. కాని అదే పూవుని భగవంతుని పీఠంమీద సమర్పించడం ఇంకా యోగ్యమైంది. అలాగే మన బాలికను ఓ పురుషునికి సమర్పించడం మంచిదే. కాని దేవునికి అంకితం చేయడం ఇంకా యోగ్యమైనపని. మన పుత్రులను దైవసేవకు అర్పించడమూ ఈలాంటిదే. మరియ మనకు ఈలాంటి కోరికలు కలిగించాలని వేడుకుందాం.

మరియ దేవునికి అంకితమైన భక్తురాలు. ఆమెను చూచి మనంకూడ హృదయం దేవునివైపు మరల్చడం నేర్చుకోవాలి. మన హృదయం ఈ లోక సుఖభోగాలతో సంతృప్తి చెందలేదు. అది దేవునికోసం కలిగింపబడింది. ఆ దేవుని ప్రేమించి ఆ దేవునియందు విశ్రమిస్తే గాని దానికి విశ్రాంతి అంటూ వుండదు. కనుక మన హృదయాలను దేవునివైపు మరల్చే భాగ్యంకోసంగూడ ఆ తల్లిని మనవిచేద్దాం.

3. దేవమాత

సిరియా దేశభక్తుడు ఏఫ్రేము "మరియు తన చేతుల్లో నిప్పును నిలుపుకుంది. తన బాహువులతో అగ్నిజ్వాలను ఆలింగనం చేసుకుంది. ఈ యగ్నిజ్వాలను ఆమె స్తన్యమిచ్చి పోషించింది. సమస్త ప్రాణికోటిని పోషించే పోషకుణ్ణి స్వయంగా చనుబాలతో పోషించి పెద్దచేసింది. భూమ్యాకాశాలు భరించలేని విశ్వభర్తను తన ఉదరంలో భరించింది. ఆ