పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాబోతు యెసెబెలు కుట్రలో జిక్కి ప్రాణాలు కోల్పోయాక అహాబు అతని పొలాన్ని స్వాధీనం చేసికోవడానికి సమరియానుండి యెస్రెయేలుకు వచ్చాడు, చట్టరీత్యా చంపబడిన ద్రోహి ఆస్తి రాజుకు చెందుతుంది. కనుక అతడు నాబోతు పొలంమీద తనకు హక్కువున్నట్లుగా ప్రవర్తించాడు. పూర్వం దావీదురాజు ఈలాగే ఊరియాను చంపించి అతని భార్య బత్షేబాను అపహరించాడు. రాజులు తలంచుకొంటే దెబ్బలకు కొదవా?

ప్రభువు అహాబు యెసెబెలుల కుట్రను గమనిస్తూనే వున్నాడు. భక్తిమంతుల మరణం ప్రభువుకి ఎంతో బాధ కలిగిస్తుంది - కీర్తన 116,15. కనుక అతడు అహాబుకి బుద్ధి చెప్పడానికి తన సేవకుడైన యేలీయాను పంపాడు, ఆ ప్రవక్త ప్రభువు వాణిగా బయలుదేరి వచ్చాడు.

అహాబు పేదవాడ్డి హత్యచేయించడమేగాక అతని పొలాన్నిగూడ దొంగిలించాడు. రెండు నేరాలు చేసాడు. కనుక అతనికి ఫెూరశిక్ష తప్పదు. ఆ రాజు పేదవాని నెత్తుటిని చిందించిన నగరంలోనే అతని నెత్తుటినిగూడ కుక్కలు నాకుతాయి. ఎంత నేరానికి అంత శిక్ష కదా!

ఏలీయా ప్రవక్తకీ రాజకీ పడదు. బాలుని కొల్చినందుకు ప్రవక్త రాజుని చీవాట్ల పెడుతూ వచ్చాడు. కనుక అతడు రాజుకి శత్రువయ్యాడు. పైగా యిప్పడు రాజు పేదవాడ్డి అన్యాయంగా చంపించాడు కదా! యిప్రాయేలీయులకు ఓ ఆచారముండేది. ఏ నరుజ్జయినా శత్రువులు చంపివేస్తే అతని చుట్టాలు ఆ శత్రువులమీద పగతీర్చుకొనేవాళ్ళు. ఇక్కడ యేలీయా నాబోతుకు చుట్టమై అహాబుమీద పగతీర్చుకోడానికి వచ్చాడు. ఈ దృష్టిలో కూడ అతడు రాజుకి శత్రువు.

ఏలీయా అహాబు బలాన్నీ రాచరికాన్నీ చూచి దడవలేదు. నిర్భయంగా ప్రభువు సందేశాన్ని అతనికి విన్పించాడు. అహాబు చేసిన దుష్కార్యానికి అతని కుటుంబమంతా నాశమైపోతుందని గర్జించాడు. అతడు, అతని భార్య యెసెబెలు, కుమారుడు అహస్యా మనుమడు యెహోరాము అంతా యుద్ధంలో చస్తారు. ఆహాబు ఓమి రాజవంశానికి చెందినవాడు. ఆ వంశమే పూర్తిగా అంతరించిపోతుంది. ఈలా అతడు వొడిగట్టిన అన్యాయానికి శాస్తి జరుగుతుంది. భార్య ప్రోద్బలంపై ప్రభువును విడనాడి విగ్రహారాధనకు పాల్పడినందులకు అహాబు సర్వనాశమైపోతాడు.

ఈ యధ్యాయమంతా గూడ కుట్రతో హత్యతో శాపాలతో నిండివుంది. కట్టకడన మాత్రం ఓమంచి సంగతి వస్తుంది.