పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవుడు యూదులకిచ్చాడు. కనుక నేల పవిత్రమైంది. ఏ కుటుంబానికి చెందిన భూమి ఆ కుటుంబం ఆధీనంలోనే వుండాలి. అన్యాక్రాంతం కాకూడదు. ఏ కుటుంబమైన పేదదై తన పొలాన్ని ఇతరులకు అమ్మకొంటే, జూబిలి సంవత్సరమైన యేబయ్యవ యేట అది తిరిగి సొంత కుటుంబానికి చెందిపోతుంది - లేవీ 25,23. కాని రాజు తీసికొన్న భూమి తిరిగి సొంతదారునికి రాదు. కనుకనే నాబోతు తన పొలాన్ని వదలుకోడానికి ఇష్టపడలేదు.

అహాబుకి ధర్మశాస్త్ర నియమాలు తెలుసు. అతడు బలాత్కారంగా పేదవాడైన నాబోతు నేలను తీసికోలేడు. కనుక కోపంతో ఇల్లజేరి విచారంగా పడకపై పండుకొన్నాడు. అతని భార్య యెసెబెలు భర్త మనస్తాపానికి కారణం తెలిసికొంది. ఆమె యూదుల ఆడపడుచు కాదు. తూరు దేశానికి చెందిన అన్యజాతి స్త్రీ. వాళ్లు బాలు అనే అన్యదేవతను కొల్చేవాళ్ళు. యెసెబెలు సమరియా దేశంలో కూడ ఈ బాలు మతాన్ని ప్రచారం చేయించింది. తనకు అడ్డమొచ్చిన యావే ప్రవక్తలను పట్టి చంపించింది-19,10.

యొసెబెలు అహాబులాగ మోషే ధర్మశాస్త్ర నియమాలను లెక్కచేసేదికాదు. ఆ రాణి దౌర్జన్యంగా నాబోతు పొలాన్ని లాగుకోవాలనుకొంది. నీ సామర్థ్యమింతేనా అని భర్తను గేలిచేసింది. అతని అధికారాన్ని తాను చేజిక్కించుకొంది. అతని రాజముద్రను తీసికొంది. అతని పేరు మీదిగా యెసెయేలు నగర అధికారాలకు జాబు వ్రాసింది. దానిమీద రాజముద్రవేసి పంపించింది.

ఆ జాబులో ఆమె నగరాధికారులను ఈలా ఆజ్ఞాపించింది. “నాబోతు పాపాలకు దేవుని కోపం దేశంమీదికి దిగివస్తుంది. ఆ కోపాన్ని తొలగించడానికిగాను మీరు ఉపవాసం చేయండి. నాబోతు దేవుణ్ణి రాజనీ శపించాడని ఇద్దరు దుర్మార్గులచేత కూటసాక్ష్యం చెప్పించండి. ఈ సాక్ష్యం ఆధారంగా అతన్ని చంపించండి".

నగరాధికారులు రాణి లేఖను చూచి అది రాజు లేఖే అనుకొన్నారు. ఆమె ఆజ్ఞాపించినట్లే చేసారు. దుర్మారులిద్దరు నాబోతు దేవుణ్ణి రాజునీ శపించాడనీ కూటసాక్ష్యం చెప్పారు. ఇద్దరెందుకంటే, ఒకడి సాక్ష్యం చెల్లదు-ద్వితీ 17,6. దేవుణ్ణి రాజనీ తిట్టడం ధర్మశాస్త్రం ప్రకారం నేరం - నిర్గ 22,28. ఈ తిట్టడమే నాబోతు చేసిన పాపం. ఈ పాపాన్ని తొలగించడానికే యెస్రేయేలు ప్రజలు ఉపవాసం పాటించింది. ఈ నేరాన్ని సాకుగా బెట్టుకొనే వాళ్లు నాబోతుని చంపించింది. కాని ఇదంతా వట్టి కుట్ర. యెసెబెలు పాపఫలం. నగరాధికారులకు యెసెబెలు కుట్రకూడ తెలియదు. వాళ్లు రాజే నాబోతును చంపమని ఆజ్ఞాపించాడు అనుకొన్నారు.

ఆరోజుల్లో యిస్రాయేలు రాజు న్యాయాధిపతికూడ. కనుక అహాబురాజు న్యాయాధిపతిగా పేదసాదలకు న్యాయం చేకూర్చవలసినవాడు. అతడే మోసంతో నాబోతును చంపిస్తే ఇక పేదలకు దిక్కెక్కడిది? కంచే చేనుమేస్తే కాపుని ఆదుకొనేదెవరు?