పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హీబ్రూ సంప్రదాయం ప్రకారం గురువు దగ్గరికి వచ్చిన శిష్యుడు తన పూర్వజీవితాన్ని మార్చుకొంటాడు. కనుక యెలీషా తన వ్యవసాయ వృత్తిని మానివేసి గురువుగారిని అనుసరించాడు. అతడు యావే మతోద్ధరణ కార్యక్రమానికి పూనుకొన్నాడు.


3. ప్రార్ధనా భావాలు

1. ఏలీయా నిరాశతో యావే మతోద్దరణ కార్యక్రమాన్ని వదలివేయాలనుకొన్నాడు. దేవుడు అతనికి కొండమీద ప్రేరణంపుట్టించి మళ్ళీ పూర్వపు పనిమీద పంపాడు. జీవితంలో మనకుగూడ అపజయాలూ నిరాశలూ కొల్లలుగా ఎదురౌతాయి. దేవుడు మనకు ఒప్పజెప్పిన పనిని వదలివేయాలనిపిస్తుంది. కాని అలా వదలివేయకూడదు. ఏలీయాలాగే మన బాధలను దేవునితో చెప్పకోవచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు. మనకు ఉత్సాహాన్ని పట్టించే వ్యక్తిదగ్గరికో తావుదగ్గరికో పనిదగ్గరికో వెళ్ళవచ్చు. దేవుడు వీళ్ళ ద్వారాగాని స్వయంగాగాని మనలను ఉత్తేజపరుస్తాడు. నూత్నబలాన్ని దయచేస్తాడు. ఆ పిమ్మట మళ్ళామన పనిమీద మనలను పంపుతాడు. ఎప్పుడుకూడ దేవుడు మనకు ఉద్దేశించిన పనిని మాత్రం వదలివేయకూడదు. అపజయాలు ఎదురైనప్పడెల్లా ప్రభువునుండి మళ్లామళ్ళా ప్రేరణం పొందుతూండాలి.

2. మోషే, యోనా, యిర్మీయా మొదలైన మహాభక్తుల్లాగే యేలీయాగూడ నిరుత్సాహానికి గురయ్యాడు. చనిపోగోరాడు. మనలనుగూడ చాలసార్లు నిరాశాభావాలు ఆవరిస్తాయి. ఐనా భక్తులందరికీ ఓదార్పును దయచేసే ప్రభువు ఒకడున్నాడు. మనం అతన్ని ఆశ్రయించడం మర్చిపోగూడదు, శ్రమలు ఎదురైనపుడు దివ్యసత్రసాద సన్నిధిలో ప్రార్థన చేసికొంటే కొంత వూరట కలుగుతుంది.

3. ఏలీయా దేవదూత ఒసగిన ఆహారాన్ని భుజించి సత్తువ తెచ్చుకొని 40 రోజులు ప్రయాణం చేసి కొండను చేరుకొన్నాడు. ఈ యాహారం మన దివ్యసత్రసాదాన్ని సూచిస్తుంది. ఈ లోకయాత్రలో దివ్యభోజనం మనకు అపారమైన బలాన్నిస్తుంది.

4. కొండమీద దేవుడు యేలీయాకు ప్రత్యక్షమయ్యాడు. అతనితో మెల్లని స్వరంతో మాటలాడాడు. అనగా అతనికి సన్నిహితుడయ్యాడు. ఏలీయా ప్రభువు సాన్నిధ్యాన్ని గుర్తించి భయంతో ముఖం కప్పుకొన్నాడు. అతని దైవానుభూతి గొప్పది. బైబుల్లో భక్తుల దైవానుభూతిని తెలియజేసే అరుదైన ఘట్టాల్లో ఇదీ వొకటి. మన జీవితంలోగూడ ఈ దైవానుభూతిని తప్పక సాధించాలి. ఈ వరాన్ని మనం ఆశతో అడుగుకోవాలి.

5. ఏలీయా పిలవగానే ఎలీషా అతనివెంటబోయాడు. పూర్వపు వ్యవసాయ జీవితాన్ని వదలివేసి యావే మత పునరుద్ధరణ కార్యక్రమానికి పూనుకొన్నాడు.